
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): త్వరలో ‘తల్లి పాదా లకు వందనం’ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లులను పాఠశాలకు పిలిపించి వారి పిల్లలతో పాదాభివందనం చేయించి, తల్లిని, మహిళలను గౌరవించడం నేర్పిస్తామని వివరించారు. సోమవారం సాయంత్రం విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ‘అమరావతి డిక్లరేషన్’ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించి, సాధ్యమైనన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, బి.అఖిలప్రియ, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ మహిళలను పూజించిన ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ బట్టాచార్య, వడయార్ క్యాన్సర్ ఇనిస్సిట్యూట్ డైరెక్టర్ వి.శాంత, పద్మావతి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ దుర్గాభవాని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పి.అనురాధ, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సభా ప్రాంగణంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఘంట శాల పవన్‌కుమార్ తన శిష్య బృందంతో ‘జగతికి మగువే జనని’ పాటకు చేసిన నృత్యాలు అలరిం చాయి. చెట్టు గొప్పదనం నుంచి చిన్నారి నూతలపాటి శ్రీవైష్ణణి పాడిన పాట ఆలోజింపచేసింది. సప్ప శివకుమార్ శిష్యబృందం అన్నమయ్య కీర్తనలకు నృత్యంచేశారు. కార్యక్రమం మధ్యాహ్నం 3 గంట లకు అంటూ విద్యార్థులను తరలించి ఏడు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో ఐదు గంటలకే వారు ఇళ్లకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వచ్చాక కూడా స్వాగత నృత్యాలతో గంట సేపు గడిపారు. ముఖ్యమంత్రి ప్రసంగించే సమయానికి బిషఫ్ హజరయ్య స్కూల్ నుంచి విద్యార్థులను రప్పించారు. వెనుక ఉన్న కూర్చిలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సీఎం రాక సందర్భంగా టిక్కిల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో వాహన చోదకులు అవస్తలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment