సుజనా అలా చేయడం కరెక్ట్ కాదు: చంద్రబాబు
విజయవాడ: రాజ్యసభలో సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఓ పక్క రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగి ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు. (చదవండి: హోదాపై సుజనా చౌదరి వింత చేష్టలు)
అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. మరోపక్క, తాను ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లలేదని పుష్కరాలకు మోదీని ఆహ్వానించడానికి వెళ్లానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ప్రైవేటు బిల్లుతో రాజకీయ లబ్ధికి కాంగ్రెస్ ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ బిల్లుకు, ప్రైవేటు బిల్లుకు ఎందుకు లింకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.