
వార్దా నీటిని నిల్వ చేసుకోండి
- ప్రజలకు సీఎం పిలుపు
- తుపానుపై సమీక్షించిన చంద్రబాబు
- అరబ్ దేశాల పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: వార్ద తుపాను వల్ల కురిసే వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసు కోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు 15 నుంచి 22 మీటర్ల వరకూ తగ్గిన నేపథ్యంలో ప్రజలు చైతన్యంతో వ్యవహరించి తమ గ్రామాల్లోని చెరువులకు వర్షపు నీటిని మళ్లించాలన్నారు. తుపానుకు సంబంధించి శనివారం ఉదయం సీఎం తన నివాసంలో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వార్ద తుపాను, నోట్ల రద్దు, వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవుల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తుపాను నేప«థ్యంలో తాను ఆదివారం నుంచి చేపట్టాల్సిన అరబ్ దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. వార్దా తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీలవైపు మళ్లడమే..
నగదు లేదనే కారణంతో ఖర్చులు వాయిదా వేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, డిజిటల్ లావాదేవీలు పెంచటమే ఏకైక మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం తన నివాసం నుంచి ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరాలకు నిధులిచ్చే పరిస్థితి లేదు
పట్టణ, నగర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదని సీఎం అన్నారు. మున్సిపల్, నగర పాలనపై శనివారం అధికారులతో సమీక్ష జరిపారు.