తూర్పుగోదావరి(రాజమండ్రి): ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరిలో పుష్కర స్నానం చేసి, రాజమండ్రి కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. సి.పి.బ్రౌన్ మందిరం ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఏకదిన చైతన్య దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుతో మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆగస్టు 12 నుంచి ఏపీలో అస్తిత్వాన్ని కోల్పోయిందన్నారు.
ఏపీకి సంబంధించి రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలంలోని పీఠాలు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. వీటి నిర్వహణతో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న అధికారికంగా ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు, బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ అయోమయంలో పడింది. మన రాష్ట్రంలో ఉన్న పీఠాల నిర్వహణకు ఏటా రూ.6 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే, ఒప్పందంపై సంతకం చేయడానికి ముందుకు రావడం లేదు.
మరో రూ.4 కోట్లు కలిపి.. మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో మనమే ఈ కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. రూ.10 కోట్లు ఏపీ ప్రభుత్వం వద్ద లేవంటే నేను నమ్మను’ అని యూర్లగడ్డ అన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బ్రౌన్ మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి, సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం విశ్రాంత కార్యనిర్వాహక సభ్యుడు వై.కె.డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
'బాబు.. ఆ మాట నిలబెట్టుకునే సమయమిదే'
Published Fri, Aug 21 2015 1:42 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement