పేదల ఆత్మగౌరవానికి శ్రీకారం | cm kcr inaugurates double bedrooms in hyderabad | Sakshi
Sakshi News home page

పేదల ఆత్మగౌరవానికి శ్రీకారం

Published Tue, Nov 17 2015 1:48 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

పేదల ఆత్మగౌరవానికి శ్రీకారం - Sakshi

పేదల ఆత్మగౌరవానికి శ్రీకారం

⇒ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు పూజ చేసి, పాలు పొంగించిన ముఖ్యమంత్రి
⇒ దేశ చరిత్రలోనే కొత్త అంకం మొదలైంది
⇒ ఇకపై కట్టే ఇళ్లన్నీ రెండు పడక గదులతోనే..
⇒ ఇళ్లు ఎంతో బాగున్నాయని గవర్నర్
⇒ ప్రశంసించారు, తనకూ ఒకటి కావాలన్నారు
⇒ తొలుత లాంఛనంగా నలుగురు మహిళలకు ఇంటి హక్కు పత్రాలు అందజేసిన సీఎం
⇒ లబ్ధిదారులతో సహపంక్తి భోజనం

 సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే రెండు పడక గదుల ఇళ్లతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒక విప్లవాత్మక చరిత్రకు శ్రీకారం చుట్టడం తనకెంతో సంతోషంగా ఉందని... రాష్ట్రంలో ఇకపై కట్టబోయే పేదల ఇళ్లన్నీ డబుల్ బెడ్రూంతోనేనని ఆయన చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్  మోడల్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించారు. తొలుత నలుగురు మహిళలకు లాంఛనంగా ఇంటిహక్కు పత్రాలను అందజేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. భారత దేశ చరిత్రలోనే ఒక కొత్త అంకానికి, కొత్త పనికి శ్రీకారం జరిగిందని... ఐడీహెచ్ కాలనీలో గత ఏడాది దసరా రోజున శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లు అనుకున్న విధంగా  పూర్తయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ గృహాల్లో ప్రవేశానికి తానే పూజ చేసి, పాలు పొంగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి 60 వేల ఇళ్లు కట్టించేందుకు రూ. 4 వేల కోట్లు మంజూరు చేశామని.. హడ్కో రుణంతో వాటిని నిర్మిస్తామని తెలిపారు.

 గవర్నర్ కూడా అడిగారు
 ప్రభుత్వం, నాయకులు మాటలు చెబుతారు తప్ప, ఇచ్చిన మాట మేరకు పనులు చేయరనే అభిప్రాయాలను పటాపంచలు చేశామని... ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఇళ్లు కట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీటిని చూడటానికి హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి ఐఏఎస్‌లు, అధికారులెందరో వచ్చారన్నారు. గవర్నర్ నరసింహన్ కూడా ఈ ఇళ్లను సందర్శించారని, అక్కడి నుంచే తనకు ఫోన్ చేసి ఇళ్లు ఎంతో బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా ఇంత మంచి ఇళ్లు లేవన్నారని, గవర్నర్‌కు కూడా ఒకటి అలాట్ చేయాల్సిందిగా చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఒకేగదికి డబ్బులిస్తుండగా, తెలంగాణలో సీఎం కేసీఆర్ అదనపు నిధులతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారంటూ కేంద్ర  మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారని కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఇచ్చే కొద్ది నిధులకు తాము నిధులు కలిపి ‘డబుల్’ ఇళ్లు కడతామని ప్రకటించారు. దసరా రోజే వీటికి ప్రారంభోత్సవం చేయాల్సి ఉన్నా... ఏపీ రాజధాని శంకుస్థాపన కోసం వెళ్లినందున కుదరలేదన్నారు.
 పేదలు కూడా అందరిలా..
 ఇప్పటిదాకా పేదల ఇళ్లంటే ఎక్కడో ఊరిబయట, అది కూడా ఒకే గదితో కట్టించేవారని... అలా కాకుండా ఆత్మగౌరవంతో బతికేలా ‘డబుల్’ ఇళ్లను నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఒకే గది ఉంటే తల్లులు బట్టలెక్కడ మార్చుకోవాలి, ఇంటికి బంధువులు వస్తే ఎక్కడ పడుకోవాలి.. ఇలాంటి సమస్యలతో బతుకు నరకంగా ఉంటుంది. ఆ బాధలు లేకుండా పేదలు కూడా ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూం ఇళ్లకు శ్రీకారం చుట్టాం. పనులెలా జరుగుతున్నాయో చూసేందుకు ఓసారి నేనిక్కడికి వచ్చినప్పుడు సామాన్లు పెట్టుకునేందుకు సదుపాయం లేదని మహిళలు చెప్పిండ్రు. దాంతో అటకలతో ఇళ్లు కట్టాలని సూచించిన. అనుకున్నట్లుగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినం..’’ అని చెప్పారు.
 2020 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు
 కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2020 నాటికి దేశంలో అందరికీ ఇల్లు కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణకు 83,678 ఇళ్లు మంజూరు చేసిందని.. ఇందుకు రూ. 1,632 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, రామగుండంలను కేంద్రం మురికి వాడల రహిత జాబితాలో చేర్చిందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ మాట ఇస్తే నిలుపుకొంటారనేందుకు నిదర్శనం ఈ గృహనిర్మాణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.

పేదల ఆకలి తెలిసిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం 16 నెలల్లోనే రూ. 30 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు, టీవీల కళ్లకు మాత్రం ఇవి కనిపించడం లేవని ఆవేశపూరితంగా చెబుతుండగా... సీఎం కేసీఆర్ వద్దని వారించడంతో ఆ వ్యాఖ్యలను ఆపేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులతో కలసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement