దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్‌ | CM KCR is anti dalit | Sakshi
Sakshi News home page

దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్‌

Published Tue, Jan 3 2017 1:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్‌ - Sakshi

దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్‌

యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల వ్యతిరేకి అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. యాదగిరిగుట్టలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగుస్తుందని ఆరు నెలల పొడగించాలని ప్రధాని మోదీని కోరిన కేసీఆర్‌.. నెల రోజులు పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్రను పదవీ కాలం పొడగించకుండా దళితుడు అనే కారణంతోనే మరో వ్యక్తిని నియమించారని మండిపడ్డారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణలో మొదటి సీఎం దళితుడే అని ఆనాడు చెప్పి.. కేసీఆర్‌ సీఎం పీఠాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేకులుగా పని చేస్తున్నారన్నారు.

రైతుల నోట్లో మట్టి...
రైతుల బాగోగుల గురించి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 2013లో భూసేకరణ చట్టం తీసుకువస్తే.. దానిని మార్చడానికి ప్రధాని మోదీ మార్చడానికి యత్నించారన్నారు. ఈ చట్టంతో రైతుల భూములకు సరసమైన ధర ఇవ్వాలని ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ఆలోచించిందని తెలిపారు. కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తెలంగాణ భూసేకరణ చట్టం 2016ని తీసుకువచ్చారని, ఈ చట్టంతో రైతుల వద్ద బలవంతంగా భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా రైతు రుణాలు రూ.లక్ష మాఫీ చేస్తానని చెప్పి..  జాప్యం చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటలో రెండుపడకల ఇళ్లు నిర్మించి ఇచ్చాడే కానీ రాష్ట్రంలో ఉన్న ఏ నిరుపేదకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించలేదని తెలిపారు. ఆ రెండు గ్రామాలకే సీఎంవా..? లేకా రాష్ట్రానికి సీఎంవా..? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగమని ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్, మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, సీనియర్‌ నాయకులు కలకుంట్ల బాల్‌నర్సయ్య, పెలిమెల్లి «శ్రీధర్‌గౌడ్, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, తంగళ్ళపల్లి సుగుణాకర్, గుండ్లపల్లి నర్సింహ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement