రత్నగిరిపై ‘శిఖ’పట్లు
రత్నగిరిపై ‘శిఖ’పట్లు
Published Sun, Feb 19 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
పురోహితులు శిఖ ధరించాలని ఈఓ ఆదేశాలు
వ్యతిరేకిస్తున్న కొంతమంది పురోహితులు
స్వామీజీ సలహాలు కోరేందుకు పురోహితుల ప్రయత్నం
అన్నవరం : రత్నగిరిపై వ్రతాలు చేయించే పురోహితులు వైదిక నియమావళి, శిఖ ధారణ తదితర అంశాలతో కూడిన కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పక పాటించాలని ఈఓ కె.నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాలు ఆ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని అనుసరించేవారు కొందరైతే, మరి కొంతమంది వీటిలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఈవో ఇచ్చిన ఈ ఆదేశాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీనిపై పురోహితుల మధ్య చర్చ నడుస్తుండగా కోడ్ పాటించని పురోహితులపై వేటు వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
వైదిక వృత్తిలో ఉండే పురోహితులు నడవడిక, వేషధారణ (కోడ్ ఆఫ్ కాండక్ట్ )కలిగి ఉండాలా? తప్పని సరిగా గుండు గీయించుకుని వెనుక వైపు పిలక కలిగి ఉండాల్సిందేనా? దీనిపై శాస్త్రం ఏమి చెప్పింది..? గతంలోలా ఇప్పుడు కూడా ఉండాల్సిందేనా..? రోజులు మారాయి కాబట్టి మేము కూడా మారతామని, అటువంటి సంప్రదాయాలును పూర్తిగా పాటించలేమని యువ పురోహితులు చెబుతున్న దాంట్లో వాస్తవముందా..? ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలోని వ్రతాల విభాగంలో వ్రతపురోహితుల మధ్య జరుగుతున్న చర్చ ఇది.
ఈ నెల మొదటి వారంలో దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు వ్రతపురోహితులు తప్పక కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాలని ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా శిఖ, వస్త్రధారణ తదితర విషయాలలో శాస్త్రం నిర్ధేశించిన దాని ప్రకారం ఉండాలని, లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అప్పటి నుంచి దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దేవస్థానంలోని 214 మంది వ్రత పురోహితుల్లో పాత తరానికి చెందిన సుమారు 125 మంది వరకూ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారిలో సగం మంది పూర్తిగా గుండు గీయించుకోకుండా తల తగ్గించుకుని వెనుక వైపు పిలక ధరించారు. మిగిలిన వారు శిఖ ధారణ తప్ప మిగిలినవన్నీ పాటిస్తున్నారు.
వర్గాలుగా విడిపోయిన పురోహితులు
దేవస్థానం ఈవో ఇచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆదేశాలకు అనుగుణంగా కొంతమంది, వ్యతిరేకంగా మరి కొంతమంది రెండు వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ఆ ఆదేశాలను అమలు చేయాలంటే మరికొంతమంది ఆ ఆదేశాలలో కొన్నింటి అమలుపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాలను వ్యతిరేకించేవారు కొత్తగా ఎన్నికైన పురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వర్గాల నేపథ్యంలోనే ఇటీవల ఓ పురోహితుడి సస్పెన్షన్ వివాదాస్పదమైంది.
ఆదేశాల్లో స్పష్టత లేదంటున్న పురోహితులు
పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ కలిగి ఉండాలని ఇచ్చిన ఆదేశాలలో శిఖ ధారణ విషయమై స్పష్టత లేదని కొంతమంది పురోహితులు అభిప్రాయపడుతున్నారు. అసలు పురోహితుల శిఖధారణ (పిలక ధారణ)ఐదు రకాలుగా ఉంటుంది. అందులో ఏది పాటించాలో వివరంగా తెలియచేయాలని కొంతమంది అంటున్నారు. అవేమీ చెప్పకుండా శిఖ ధారణ ఉండాలని ఆదేశాలివ్వడం, పాటించకపోతే చర్యలుంటాయని చెప్పడం సబబు కాదంటున్నారు. కొందరు యువతరం పురోహితులైతే బలవంతంగా తమ చేత శిఖధారణ చేయించాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పిలక ధరించి ఉంటే తమకు వివాహాలు కావడం లేదని వారు వాపోతున్నారు.
స్వామీజీ సూచనల కోసం పురోహితులు
దేవస్థానం పురోహితుల శిఖ ధారణపై తగిన సూచనలివ్వాలని కొంతమంది పురోహితులు తునిలోని ఓ ప్రముఖ స్వామీజీని కలిసి కోరనున్నట్టు తెలిసింది. ఆ స్వామీజీ సూచనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించినట్టు పురోహితులు చెబుతున్నారు. ఇందు కోసం ఈఓని పది రోజులు గడువు అడిగినట్టు సమాచారం.
పురోహితులు కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందే ఈఓ
దేవస్థానంలో పనిచేసే పురోహితులంతా కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించాల్సిందేనని ఈఓ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దీనిపై పది రోజులు గడువు కావాలని పురోహితుల సంఘం కార్యదర్శి బండి నర్శింహమూర్తి అడిగారని దానికి అంగీకరించామన్నారు. పది రోజుల తరువాత కోడ్ ఆఫ్ కాండక్ట్ పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు.
Advertisement