- అగళిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
అనంతపురం అగ్రికల్చర్:
చలిపులి 'అనంత'ను వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నా.. చాలా మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. కదిరి, మడకశిర, హిందూపురం, పెనుకొండ, ఉరవకొండ ప్రాంతాల్లో చలితీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. గురువారం అగళి మండలంలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 12.2 డిగ్రీలు, రొద్దం 12.6, పుట్లూరు 12.7, బెళుగుప్ప 12.8, మడకశిరలో 12.8 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 16 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమ ఉదయం 78 -92, మధ్యాహ్నం 28 - 40 శాతం వరకు ఉంది. మొత్తమ్మీద చలితీవ్రత పెరగడంతో జనం వణుకుతున్నారు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చలిప్రభావం కనిపిస్తోంది.