– ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య వయొలేషన్ చిచ్చు
– రూ.10కి మించి వయొలేషన్ జరిగితే కేసు నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశం
– తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్
– జిల్లాలో రూ.10–30 వరకూ ధర పెంచి విక్రయిస్తున్న మద్యం వ్యాపారులు
– ‘సిండికేట్’తో అబ్కారీ యంత్రాంగంతో పాటు పోలీసులకు మామూళ్ల పంట
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
ఎక్సైజ్ శాఖలో ‘వయొలేషన్’ చిచ్చు రేగిందా? రెండు విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా? బండి ఇరుసులాగా ఇన్నాళ్లూ సమానంగా వయొలేషన్‌ను పెంచి పోషించిన ఆ విభాగాల మధ్య ఇప్పుడు తేడా ఎందుకు వచ్చింది? ఈ పంచాయితీ ఏకంగా డైరెక్టరేట్ వరకూ వెళ్లిందా?.. జిల్లాలోని తాజా పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది.
పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా ఏమాత్రమూ ఖాతరు చేయకుండా అబ్కారీ శాఖ యథేచ్ఛగా ‘వయొలేషన్’(ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయం)ను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ప్రతినెలా రూ.5–14 కోట్ల అదనపు ఆదాయం మద్యం వ్యాపారులకు వస్తోంది. ఈ దోపిడీతో మందుబాబుల జేబులు గుల్లవుతుండగా..సర్కారీ గల్లా పెట్టె, వ్యాపారుల జేబులు మాత్రం గలగలలాడుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల జిల్లాలో ఐదు బృందాలుగా విడిపోయి మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు జరుపుతున్నారని కేసులు నమోదు చేశారు.
అమడగూరులో క్వార్టర్ బాటిల్‌పై రూ.15, రాయదుర్గం పరిధిలో ఫుల్‌బాటిల్‌పై రూ. 30 పెంచి విక్రయిస్తున్న దుకాణదారులపై కేసు నమోదు చేశారు. వీటితో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామంతో ఎక్సైజ్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘ఇన్నిరోజులూ వయొలేషన్ జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులనూ బాగానే చూసుకుంటున్నాం. కానీ ఉన్నపళంగా ఎందుకు కేసులు నమోదు చేస్తున్నార’ని ఆరా తీశారు. దీంతో అసలు విషయం తెలిసింది. ‘అనంత’లో వయొలేషన్ విచ్చలవిడిగా సాగుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఈఎస్‌లతో డైరెక్టర్ స్వయంగా మాట్లాడి.. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ భారీగా వయొలేషన్ ఉన్నట్లు గుర్తించారు. ఎమ్మార్పీపై రూ.10 పెంచి విక్రయించేవాటిని వదిలి, అంతకుమించి అమ్ముతున్న వాటిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
కోల్డ్‌వార్ ఎందుకో?
ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలను ఎక్సైజ్ డీసీ నుంచి సీఐల వరకూ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘వాటా’ ఇస్తున్నా ఎందుకు కేసులు రాస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. డైరెక్టర్ ఆదేశాలతోనే రాస్తున్నామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ‘రూ.10 వరకూ డైరెక్టర్ కూడా అనుమతి ఇచ్చారు కదా? రూ.10 మాత్రమే వయొలేషన్ అవుతున్నా అంతకుమించి జరుగుతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నార’ని ఎక్సైజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాత్రం తాము రూ.10కి మించిన విక్రయాలపైనే కేసులు నమోదు చేస్తున్నామని అంటున్నారు. అయితే.. వాటాల పంపకంలో తేడాల వల్లే ఈ తతంగం నడుస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆదాయం కోసం ఆన్‌లైన్ బిల్లింగ్‌కు బ్రేక్
ఈ నెలాఖరుతో ఎక్సైజ్ పాలసీ ముగుస్తుంది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 240 దుకాణాలు నడుస్తున్నాయి. ఒక్కో దుకాణంలో రోజుకు సగటున 650 బాటిళ్లు విక్రయిస్తున్నారు. వయొలేషన్ కారణంగా 240 దుకాణాల్లో నెలకు రూ.4.68 కోట్ల నుంచి రూ.14.04 కోట్లదాకా వ్యాపారులకు అదనపు ఆదాయం వస్తోంది. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల దాకా స్థాయిని బట్టి ఎవరివాటా వాళ్లకు చేరుతోందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. వేతనాల కంటే ‘అదనపు’ ఆదాయమే భారీగా ఉండటంతో ‘వయొలేషన్’ను అరికట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టేలా ఆన్‌లైన్ బిల్లింగ్ అంశాన్ని గతంలో కిరణ్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్‌లైన్ బిల్లింగ్‌ను ‘కార్వే’ సంస్థకు కట్టబెట్టారు. బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్క్రాచ్‌చేస్తే ఎమ్మార్పీకే బిల్లు వస్తుంది. ఈ మేరకే మందు బాబులు చెల్లించాలి. ఇది జరిగితే తమ ఆదాయానికి గండిపడుతుందన్న భావనతో మద్యం వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారుల వరకూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కంప్యూటర్లు సరఫరా చేశాం.. అమలు చేస్తామ’ని పైకి చెబుతూ లోలోపల మాత్రం అడ్డుపడుతున్నారు. అందుకే నాలుగేళ్లుగా ఆన్‌లైన్ బిల్లింగ్ ముందుకు సాగడం లేదు.
జిల్లాలో మద్యం దుకాణాలు : 240
బార్ అండ్ రెస్టారెంట్లు : 9
బాటిల్‌పై అధికంగా విక్రయిస్తున్న ధర : రూ.10–30
ధర పెంపు వల్ల వ్యాపారులకు నెలకు వచ్చే అదనపు ఆదాయం : రూ.4.68–14.04కోట్లు
అధికారులకు వ్యాపారులు ఇస్తున్న నెలవారీ మామూళ్లు: రూ.1.30 కోట్లు
ఒక్కో దుకాణం నుంచి నెలకు ఇవ్వాల్సిన మామూళ్లు : పట్టణప్రాంతాల్లో రూ.61 వేలు,
గ్రామీణ ప్రాంతాల్లో రూ.51 వేలు
విశ్వసనీయ సమాచారం మేరకు నెలవారీ మామూళ్ల పంపకం ఇలా..(రూ. వేలల్లో)
పట్టణ ప్రాంతాలు రూరల్
ఎక్సైజ్ స్టేషన్ 35 25
ఈఎస్‌టీఎఫ్ 5 5
ఎన్‌ఫోర్స్‌మెంట్ 6 6
సివిల్‌స్టేషన్ 15 15
––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 61 51
–––––––––––––––––––––––––––––––––––––
కోల్డ్‌వార్
Published Fri, May 5 2017 11:30 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement