
సేవ ముసుగులో స్వార్థం!
కళాశాల, పాఠశాల ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన ఓ గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులోకి
♦ గ్రంథాలయం నిర్మాణం కోసం
♦ రూ. కోటి విలువైన కళాశాల స్థలం అప్పగింత
♦ దాతల సహకారంతో భవన నిర్మాణం పూర్తి
♦ కళాశాలకు అప్పగించకుండా
♦ సొంతానికి వాడుకుంటున్న వైనం
♦ చోద్యం చూస్తున్న కళాశాల యంత్రాంగం
♦ వివేకానంద చైతన్య సమితి నిర్వాకం
సాక్షి ప్రతినిధి, కడప : కళాశాల, పాఠశాల ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన ఓ గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేకుండా సొంత వ్యవహారాలకు వాడుకుంటున్న ఓ సంస్థ వైనమిది. గ్రంథాలయం నిర్మాణం కోసం పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 5 సెంట్లు పైబడిన స్థలాన్ని స్థానిక వివేకానంద చైతన్య సమితికి అప్పగించారు. అందులో గ్రంథాలయం నిర్మించి అటు విద్యార్థులకు ఇటు గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కళాశాల యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వివేకానంద చైతన్య సమితి దాతల సహకారంతో దాదాపు రూ.30 లక్షలు వెచ్చించి సౌకర్యాలు కల్గిన భవనాలను సమకూర్చింది. అయితే కళాశాల లేదా ఉన్నత పాఠశాలకు అప్పగించకుండా కమిటీ సభ్యులకు మాత్రమే దానిని పరిమితం చేశారు. అందులో కొందరు ఉపాధ్యాయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వారు వ్యక్తిగత అవసరాలకు ఈ భవనాన్ని వాడుకుంటున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
టాయ్‌లెట్స్ వాడుకునేందుకు సైతం నిరాకరణ
ఉన్నత పాఠశాల పరిధిలో టాయ్‌లెట్స్ లేవు. బాలబాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో గ్రంథాలయం పరిధిలో నిర్మించిన టాయ్‌లెట్స్‌ను వినియోగించుకునేందుకు సైతం కమిటీ సభ్యులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అధునాతన భవనం కళ్లెదుట ఉన్నా, అటు ఉన్నత పాఠశాల, ఇటు జూనియర్ కళాశాల యంత్రాంగం సైతం అందుబాటులోకి తెచ్చుకుందామని ఆలోచించడం లేదు. అందుకు కారణం కొంత మంది ఉపాధ్యాయులు కమిటీ సభ్యులుగా ఉండటమేనని తెలుస్తోంది. ప్రభుత్వ స్థలంలో భవనం నిర్మించి.. అటు గ్రంథాలయం నిర్వహించక, ఇటు విద్యార్థులకు ఉపయోగపడకుండా ఉండిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కొంతమంది వ్యక్తులు ప్రవేటు చీటీల నిర్వహణ కోసం దీనిని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రంథాలయాన్ని పాఠశాల లేదా కళాశాలకు అప్పగించాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఆ భవనాన్ని విద్యార్థులకు జ్ఞాన భాండగారంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అలాగే సామాజిక స్పూర్తికి దర్పంగా నిలవాల్సిన బాధ్యత సైతం వివేకానంద చైతన్య సమితి భుజస్కంధాలపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.