క్యాబ్ ను లైబ్రరీగా మార్చేశాడు!
టెహ్రాన్ః మనిషి ఆలోచనల్ని క్రమబద్ధీకరించడానికి, వ్యక్తిలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహద పడుతుంది. అందుకే పుస్తక ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఓ ఇరానియన్ క్యాబ్ డ్రైవర్ ప్రయత్నం ప్రారంభించాడు. ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు.. పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా తన నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఇరాన్ లోని రాస్ట్ సిటీ లో నడిపే తన ట్యాక్సీలో పుస్తకాలను నింపేసి ప్రయాణీకులకు ఓ మినీ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు.
తన షెటిల్ టాక్సీని ఓ మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు ఇరాన్ కు చెందిన సాహెల్ ఫిల్ సూఫ్. పుస్తక పఠనంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మిన అతడు... తన ప్యాసింజర్లను పఠనానికి ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో తన టాక్సీలో ప్రయాణించే వారికి లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. కొంతకాలం క్రితమే తనకు లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన క్యాబ్ ను వినియోగించి ప్రజలకు చేరువవ్వచ్చునన్న ఆలోచనను ఆచరణలో పెట్టానని సాహెల్ చెప్తున్నాడు. ఆధునిక కాలంలో అనేక ఒత్తిళ్ళతో సతమతమౌతున్న ప్రజలకు పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుందని, ఉపశమనం కలిగిస్తుందని భావించానని, అందుకే ఈ మొబైల్ లైబ్రరీ ని ఏర్పాటు చేశానని సాహెల్ చెప్తున్నాడు.
తన క్యాబ్ ట్యాక్సీలో సాహెల్ వివిధ రకాల పుస్తకాలను సుమారు 50 వరకూ పాఠకులకు అందుబాటులో ఉంచాడు. మనస్తత్వ శాస్త్రం, పిల్లల పుస్తకాలు, చరిత్ర వంటి ఎన్నో గ్రంథాలతో ఇప్పుడు సాహెల్ క్యాబ్ లైబ్రరీ పుస్తాకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పైగా తన లైబ్రరీకి ఫ్యాన్స్ గా మారిన ప్యాసింజర్లు ఎక్కువగా మహిళలు, యువకులేనని సాహెల్ చెప్తున్నాడు. గిలాన్ ఉత్తర ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల అధికారులను అనుమతి కోరానని, వారు తన మొబైల్ లైబ్రరీ నాణ్యత పెరిగే పుస్తకాలను సూచించి సహకరించారని సాహెల్ వివరించాడు. నా కారులో ప్రయాణించే వారు చదివేందుకు మంచి పుస్తకం ఇమ్మని అడిగినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుందని, నేను మంచి పని చేశానన్న సంతోషం కలుగుతుందని సాహెల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.