ఆరోగ్యపరంగా భయాందోళన వద్దు
ఆరోగ్యపరంగా భయాందోళన వద్దు
Published Thu, Jun 29 2017 11:48 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ : జిల్లాలో సీజనల్ వ్యాధుల ఉనికి పూర్తిగా అదుపులో ఉందని, ఆరోగ్యపరంగా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోను కావద్దని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఏజెన్సీ, విలీన, మైదాన మండలాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపట్టిన కార్యక్రమాలను, జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆరోగ్య అప్రమత్తత, పారిశుద్ధ్య ఉద్యమాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ గత ఆదివారం వై.రామవరం మండలం బొడ్డగండి గ్రామ పరిధిలోని చాపరాయి ఆవాసంలో అస్వస్థతకు లోనైన 32 మంది ప్రత్యేక వైద్య సేవల ద్వారా కోలుకుంటున్నారన్నారు. బొడ్డగండి పంచాయితీ పరిధిలో మొత్తం 40 జనావాసాలు ఉండగా 27 కొండకు ఒకవైపు, చాపరాయితో సహా మరో 13 ఆవాసాలు కొండకు మరో వైపు ఉన్నాయన్నారు. 13 ఆవాసాల్లో 4 ఆవాసాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుబాటులో ఉండగా, మిగిలిన ఆవాసాలకు చేతిపంపుల నీరు అందుబాటులో ఉందన్నారు. చాపరాయిలో బోర్ల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి నుంచి వచ్చే నీరు పైపుల వాసన వస్తోందని ఆవాస ప్రజలు వాగులోని నీరు తాగుతున్నారని, ఈ నీరు జంతుకళేబరంతో కలుషితం కావడం వల్ల వాంతులు, విరేచనాలకు గురై ప్రాణాపాయ స్థితులు ఎదురయ్యాయన్నారు. చాపరాయి ఆవాసానికి రోడ్డు కనెక్టివిటీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్ల వ్యాధులు సోకిన సమాచారం తెలిసేలోగా 16 మంది దురదృష్టవాశాత్తు మృతి చెందారన్నారు. చాపరాయిలో కొత్తగా డయేరియా, వాంతులు ఎవరికీ సోకలేదని చెప్పారు. డీపీఓ, డీఆర్‌డీఏ పీడీ, ఎస్‌డీసీలు గ్రామంలోనే ఉండి ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగిని పంపి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా పిల్లలు రక్తహీనత ఎదుర్కొంటున్నందున పౌష్టికాహారం అందిస్తూ 15 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఏజెన్సీ, విలీన మండలాల్లో ప్రజారోగ్య పర్యవేక్షణకు సరైన రోడ్డు కనెక్టివిటీ, సమాచార వ్యవస్థల లేమి ప్రతి బంధకంగా ఉందని, ఈ వ్యవస్థలను అన్ని ఆవాసాలకు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా 41 కిలోమీటర్ల చాపరాయి చేరే రోడ్డును ఆర్‌అండ్‌బీ ద్వారా అభివృద్ధి చేయనున్నామన్నారు. విశాట్, హోమ్ రేడియో వ్యవస్థల ద్వారా సమాచార వ్యవస్థను విస్తరిస్తామన్నారు. చాపరాయి ఉదంతంపై రంపచోడవరం ఐటీడీఏ పీఓతో సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.జితేంద్ర, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
Advertisement