డీఆర్‌డీఏ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
–డీడీయుజిఎస్‌వై శిక్షణ కార్యక్రమం రద్దు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు కోపం వచ్చింది. ఒక కార్యక్రమంలో మరో కార్యక్రమానికి సంబంధించిన వారు సైతం ఉండటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన కోపంతో కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వెళ్లిపోయారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం 'దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన–సీడ్యాప్' ఉచిత శిక్షణ కేంద్రాల ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఇదే ఆడిటోరియంలో 4 గంటలకు విద్యాసంస్థల యాజమాన్యాలు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపల్‌లతో నగదు రహిత లావాదేవీలపై సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆలస్యం అయ్యింది. ఈలోపు రెండో కార్యక్రమానికి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ ఆడిటోరియం చేరుకుని కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ 4.15 గంటలకు ఆడిటోరియంలోకి వచ్చారు. రాగానే రెండు కార్యక్రమాలకు సంబంధించిన అందరూ ఒకేచోట కూర్చుని ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన వేదిక ఎక్కకుండానే కోపంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. డీడీయుజిఎస్‌వై కార్యక్రమాన్ని మీరే నిర్వహించుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్‌కు వెళ్లారు. డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ వెళ్లి పరిస్థితిని విన్నవించినా ఆయన శాంతించలేదు. దీంతో శిక్షణ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ ప్రకటించారు. ఈ కారణంగా ఆడిటోరియంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ముందుగా అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు బయటకు వెళ్లారు. ఆ తర్వాత డీఆర్‌డీఏ కార్యక్రమానికి వచ్చిన వారు వెనుదిగారు. 5 గంటల తర్వాత జిల్లా కలెక్టర్ రెండో కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.