'పిల్లల చదువులకు ఆటంకం కలుగనివ్వం'
గట్టు (మహబూబ్‌నగర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. బుధవారం గట్టులోని ఉపాధ్యాయులు లేని బాలికల ప్రాథమిక పాఠశాలతో పాటుగా చింతకుంట స్కూలును కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయుల కొరతపై మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు హై కోర్టుకు లేఖలు రాసిన తరుణంలో సుమొటోగా కేసును విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కలెక్టర్ పాఠశాలలను సందర్శించారు. చింతకుంటకు చెందిన సతీష్, లక్ష్మీ, శాంతి అనే విద్యార్థులు ఆవేశంగా ఉపాధ్యాయుల కొరత, తాము పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు విన్నవించారు. విద్యార్థుల ఆవేదనకు కలెక్టర్ చలించిపోయి.. వారిని అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు జిల్లా వ్యాప్తంగా 1750 విద్యాబోధకులను నియమించనున్నట్లు వివరించారు. రేషనలైజేషన్, విద్యార్థుల నమోదు విషయంలో సెప్టెంబర్ హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్లనే ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. రిలీవర్ వస్తేనే బదిలీ చేయాలని చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా తొందరపడి గత విద్యాధికారి కొంతమందిని రిలీవ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయ బదిలీల్లో పట్టణానికి దగ్గరలో రోడ్డు పక్కనే ఉన్న కొన్ని పాఠశాలల పోస్టులను బ్లాక్ చేయాలని చెప్పినా గత విద్యాధికారి పట్టించుకొలేదని, జిల్లాకు కేవలం 700 విద్యాబోధకులు అవసరమున్నట్లుగా నివేదికను అందించిన విద్యాధికారి రాజేష్‌ను సరెండర్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
మాకు టీచర్లు కావాలి
మా ఊరికి కొత్తగా టీచర్లు రావడం లేదు. ఉన్న వాళ్లు బదిలీపై వెళుతున్నారు. వెళ్లే వారే కానీ.. వచ్చే వారు లేరు. కర్ణాటక సరిహద్దులో ఉన్నాం. బస్సు సౌకర్యం లేదు. చదువుకోవాలనే తపన ఉంది. ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు వెళ్లిపోయారు. మరో ముగ్గురు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లుగా పిల్లలు ఎక్కువగా ఉన్నా, ఇక్కడ టీచర్ల కొరత చాలా ఉంది. రవాణా సౌకర్యాలు లేక చింతకుంటకు టీచర్లు రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే హై కోర్టుకు లేఖలు రాశాం. మా చదువు దెబ్బ తినకుండా మీరే కాపాడాలి. -శాంతి, 9వ తరగతి.