TK sridevi
-
ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొందరు మున్సి పల్ కమిషనర్లు తెలంగాణ మున్సి పాలిటీ 1965, 2019 చట్టాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పాలన విభాగం డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
భావి తరాలకు మేలు చేద్దాం
– సారారహిత జిల్లాగా కొనసాగిద్దాం – ‘హరితహారం’లో కలెక్టర్ టీకే శ్రీదేవి భూత్పూర్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భావి తరాలకు మేలు కలిగేలా చూడాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పిలుపునిచ్చారు. శనివారం భూత్పూర్ మండలంలోని కొత్తూరు, తాటిపర్తిలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో అడవుల విస్తీర్ణం కేవలం 16శాతం మాత్రమేనన్నారు. ఇవి రోజురోజుకూ తరిగిపోతుండటంతో సకాలంలో వర్షాలు కురియక కరువు ప్రాంతాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పోవాలంటే ఏటా ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాను సారారహితంగా కొనసాగించాలన్నారు. విరివిగా ఈత మొక్కలు నాటి ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకుగాను ఎక్సైజ్ శాఖ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్‌లు జంగమ్మ, ఫసియొద్దీన్, ఎంపీపీ సుకన్యానారాయణగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, ఎంపీటీసీ సభ్యురాలు సరిత, ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేష్, ఆర్డీఓ వనజాదేవి, ఎంపీడీఓ గోపాల్‌నాయక్, తహసీల్దార్ జ్యోతి, జడ్చర్ల ఎస్ఐ జనార్దన్ పాల్గొన్నారు. -
'పిల్లల చదువులకు ఆటంకం కలుగనివ్వం'
గట్టు (మహబూబ్‌నగర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. బుధవారం గట్టులోని ఉపాధ్యాయులు లేని బాలికల ప్రాథమిక పాఠశాలతో పాటుగా చింతకుంట స్కూలును కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయుల కొరతపై మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు హై కోర్టుకు లేఖలు రాసిన తరుణంలో సుమొటోగా కేసును విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కలెక్టర్ పాఠశాలలను సందర్శించారు. చింతకుంటకు చెందిన సతీష్, లక్ష్మీ, శాంతి అనే విద్యార్థులు ఆవేశంగా ఉపాధ్యాయుల కొరత, తాము పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు విన్నవించారు. విద్యార్థుల ఆవేదనకు కలెక్టర్ చలించిపోయి.. వారిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు జిల్లా వ్యాప్తంగా 1750 విద్యాబోధకులను నియమించనున్నట్లు వివరించారు. రేషనలైజేషన్, విద్యార్థుల నమోదు విషయంలో సెప్టెంబర్ హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్లనే ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. రిలీవర్ వస్తేనే బదిలీ చేయాలని చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా తొందరపడి గత విద్యాధికారి కొంతమందిని రిలీవ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయ బదిలీల్లో పట్టణానికి దగ్గరలో రోడ్డు పక్కనే ఉన్న కొన్ని పాఠశాలల పోస్టులను బ్లాక్ చేయాలని చెప్పినా గత విద్యాధికారి పట్టించుకొలేదని, జిల్లాకు కేవలం 700 విద్యాబోధకులు అవసరమున్నట్లుగా నివేదికను అందించిన విద్యాధికారి రాజేష్‌ను సరెండర్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మాకు టీచర్లు కావాలి మా ఊరికి కొత్తగా టీచర్లు రావడం లేదు. ఉన్న వాళ్లు బదిలీపై వెళుతున్నారు. వెళ్లే వారే కానీ.. వచ్చే వారు లేరు. కర్ణాటక సరిహద్దులో ఉన్నాం. బస్సు సౌకర్యం లేదు. చదువుకోవాలనే తపన ఉంది. ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు వెళ్లిపోయారు. మరో ముగ్గురు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లుగా పిల్లలు ఎక్కువగా ఉన్నా, ఇక్కడ టీచర్ల కొరత చాలా ఉంది. రవాణా సౌకర్యాలు లేక చింతకుంటకు టీచర్లు రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే హై కోర్టుకు లేఖలు రాశాం. మా చదువు దెబ్బ తినకుండా మీరే కాపాడాలి. -శాంతి, 9వ తరగతి. -
ఉద్యానశాఖలో ‘సూక్ష్మ సేద్యం’ విలీనం
మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవోకు అనుగుణంగా మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉద్యానశాఖలో సూక్ష్మసేద్యం పథకాన్ని (తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) విలీనం చేస్తున్నట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ టీకే. శ్రీదేవి ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యానశాఖ రెండో సహాయ సంచాలకుల కార్యాలయాన్ని త్వరలోనే నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ రెండు శాఖల విలీనంతో సిబ్బంది కొరత తీరడంతో పాటు సంక్షేమ పథకాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు. -
పేదలకు మెరుగైన వైద్యసేవలు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ టీకే శ్రీదేవి వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో వైద్యఆరోగ్య సేవలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లీపిల్లల సంరక్షణ చేపట్టాలని కోరారు. ప్రజారోగ్యంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఏరియాఆస్పత్రుల్లో ఆపరేషన్లు నిర్వహించాలని, అందుకోసం అవసరమైన వైద్యనిపుణులను ఎంపికచేసి విధులు కేటాయించి నట్లు ఆమె తెలిపారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సేవాభావం అలవర్చుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించకూడదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలు అందిస్తామనే భరోసా కల్పించాలని హితబోధచేశారు. పల్లెవికాసం కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్యసమస్యలకు తగిన చికిత్సలు చేయాలన్నారు. అంగన్‌వాడీకేంద్రాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందే విధంగా ఆరోగ్యకార్యకర్తలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఏరియాఆస్పత్రుల్లో పూర్తిస్థాయి ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. వైద్యాధికారులు తమ పరిధిలోని ఆస్పత్రులను తనిఖీలు చేపట్టి సేవలు సక్రమంగా అందేవిధంగా చూడాలన్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచే స్తున్న సిబ్బందిని కొనసాగించాలని సూచించారు. మిషన్ ఇంధ్రధనుష్లో ఏడు రకాల టీకాలను ప్రతి చిన్నారికి విధిగా వేయించాలన్నారు. ఈ ఏడాది 130 పాఠశాలల్లో 36,103మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 1430మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. 1194 మంది విద్యార్థులకు కంటిఅద్దాలు అందించినట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి వివరించారు. 18ప్రాథమిక పాఠశాలల్లో ఈ మార్చి నాటికి 3043 మంది చిన్నారులకు నేత్రపరీక్షలు నిర్వహించి.. 56మందికి కంటిఅద్దాలు అందించామన్నారు. కలెక్టర్ ప్రత్యేక నవజాత శిశుచికిత్స కేంద్రం, క్యాలీఫర్, ఆర్థోపెడిక్ విభాగాలను పరిశీలించారు. సమావేశంలో ఇన్చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్యాముల్, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు : కలెక్టర్
మహబూబ్‌నగర్ (టౌన్): జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాది కూలీలందరికి మార్చి నెలాఖరు నాటికి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనిచేస్తామని ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పని కల్పించని వారిని సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ హెచ్చరించారు. ఇక కూలీలకు పని కల్పించే విషయంలో ముందస్తు ప్రణాళికల్ని రూపొందించుకొని సాధ్యమైననీ ఎక్కువ రోజులు పని కల్పించాల్సిందిగా వారికి సూచించారు. ఇంత వరకు పనులు చేపట్టేందుకు గుర్తించిన వాటిలో తక్షణమే పనులు ప్రారంభించాలని, ఈవిషయంలో కూలీలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.