సామాజిక బాధ్యత పెంచడానికే తనిఖీలు
సామాజిక బాధ్యత పెంచడానికే తనిఖీలు
Published Mon, Apr 17 2017 10:42 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
-మరో 25 అంగన్‌వాడీ కేంద్రాల దత్తత యోచన
-కలెక్టర్ సతీమణి, శిశుసంజీవిని కో ఆర్డినేటర్ శ్రీదేవి
వెదురుపాక(రాయవరం) : ‘జిల్లాలో 50 అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకున్నాను. ఆ కేంద్రాల్లో సామాజిక బాధ్యతను పెంచడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. మరో 25 కేంద్రాలను దత్తత తీసుకునే యోచన ఉం’దని కలెక్టర్ సతీమణి, మహిళా శిశు సంజీవిని జిల్లా కో ఆర్డినేటర్ హెచ్.శ్రీదేవి తెలిపారు. మండలంలోని వెదురుపాకలో సోమవారం 10వ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,546 సెంటర్లలో 50 సెంటర్లను యూనిసెఫ్ çసహకారంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంజీవిని స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో మత్స్యకార, నాన్ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన బలహీనమైన చిన్నారులు జన్మిస్తున్నారని, వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడం లేదని అన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకునేలా చైతన్యం కల్పిస్తూ ఏడాదిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సఫలమైందన్నారు. బాల్య వివాహాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేసుకున్నవారికిì పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటున్నారన్నారు.
చిన్న గుడ్లు తీసుకోవద్దు..
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా శ్రీదేవి కోడిగుడ్లు చిన్నవిగా ఉండడం గమనించారు. గుడ్లు చిన్నవిగా ఉంటే ఎందుకు తీసుకుంటున్నారని కేంద్రం కార్యకర్తను ప్రశ్నించారు. చిన్నవిగా ఉన్న గుడ్లను వెనక్కు ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. చిన్నారులకు ఆటపాటలు ఎలా నేర్చుకున్నదీ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్ పీవో సీహెచ్ వెంకటనరసమ్మ, సూపర్‌వైజర్ అన్నపూర్ణలకు కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో వీఆర్వో పైన నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పల్లేటి వెంకటరత్నం, యానిమేటర్ ఎం.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement