-ఖమ్మంలో నిలిపివేసిన పోలీసులు
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
-సిబ్బంది పాత్రపై అనుమానం
తిరువూరు
బియ్యం బస్తాల్లో రంగురాళ్ళు నింపి హైదరాబాదుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఖమ్మం పోలీసులు జరిపిన తనిఖీలో వెలుగుచూసింది. తిరువూరు నుంచి హైదరాబాదు వెళుతున్న ఆర్టీసీ బస్సులో 5 బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఖమ్మం బస్టాండులో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. తొలుత బియ్యం బస్తాలుగా భావించినప్పటికీ విసృ్తత తనిఖీలు జరపడంతో బియ్యం మధ్యలో రంగురాళ్ళను నింపి హైదరాబాదుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ బస్తాలు ఎవరు బస్సులో వేశారు, ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారాన్ని బస్ డ్రైవరు వెల్లడించకపోవడంతో అతనిని అక్కడికక్కడే విధుల నుంచి దింపివేశారు. బస్సును సీజ్ చేయడానికి పోలీసులు యత్నించగా విజయవాడ ఆర్టీసీ రీజనల్ అధికారులు కలుగజేసుకుని ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా వేరొక డ్రైవరుతో బస్సును హైదరాబాదు పంపారు.
డ్రైవరుపై చర్యలకు నిర్ణయం
బస్సులో రంగురాళ్ళను తరలిస్తున్న వైనంపై ఆర్టీసీ అధికారులు సైతం సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సిబ్బంది ప్రమేయం లేకుండా బస్సులో లగేజీ తరలించడం సాధ్యపడదని భావించిన అధికారులు తిరువూరు డిపోలో కొందరు డ్రైవర్లపై చర్యకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే తనిఖీలో పట్టుబడిన బస్ డ్రైవరును విచారిస్తున్న అధికారులు మరింత సమాచారం కోసం యత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ కంట్రోలర్లు తమకు కేటాయించిన రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయకపోవడంతో అసలు ఏం జరుగుతోందనే విషయం యాజమాన్యానికి అంతుబట్టట్లేదు.
విచారణ జరుపుతున్నాం
తిరువూరు డిపో బస్సులో బియ్యం బస్తాల పేరుతో రంగురాళ్ళను తరలిస్తున్న విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నాం. సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు రుజువైతే సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- సత్యనారాయణ, తిరువూరు ఆర్టీసీ డిపో మేనేజర్