అవినీతి ‘ఖజానా’ | comissions of tressuary office | Sakshi
Sakshi News home page

అవినీతి ‘ఖజానా’

Published Sun, Aug 6 2017 9:52 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అవినీతి ‘ఖజానా’ - Sakshi

అవినీతి ‘ఖజానా’

– ట్రెజరీ కార్యాలయాల్లో ముడుపుల దందా
– ప్రతి బిల్లుకూ ముట్టజెప్పాల్సిందే
– ఉద్యోగుల వేతన బిల్లులకు ఫిక్స్‌డ్‌ రేట్‌
– కాసులు ఇవ్వకపోతే కొర్రీలే


ఖజానా కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న ఏ బిల్లు పాస్‌ కావాలన్నా పర్సంటేజేలు ముట్టజెప్పాల్సిందే. ఎవరైనా ఇవ్వకపోతే కాంట్రాక్టు బిల్లు, ఉద్యోగుల వేతన బిల్లు, మెడికల రీయింబర్స్‌మెంట్, ఎల్‌టీసీ, ఇతర బిల్లులకు సంబంధించి ఫిక్స్‌డ్‌ రేట్‌ నిర్ణయించారు. కాసులు ఇవ్వకపోతే అది ఎలాంటి బిల్లు అయినా కొర్రీ వేసి వెనక్కు పంపుతారనే విమర్శలు ఉన్నాయి.


అనంతపురం అర్బన్‌: జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో ‘మామూళ్ల పర్వం’ సర్వసాధారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులకు ఇక్కడ క్లియరెన్స్‌ తప్పనిసరి. బిల్లు మొత్తం రూ.కోట్లలో ఉంటుంది. ఇదే ఇక్కడి పనిచేస్తున్న కొందరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. కాంట్రాక్టర్లకు సంబంధించి బిల్లులు క్లియరెన్స్‌ వచ్చాయంటే పండగే. రూ.లక్షల పనికి రూ.300 నుంచి రూ.500 ముడుపులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ శాఖలకు సంబంధించి ప్రతి రోజూ ఎంత లేదన్నా రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బిల్లులకు క్లియరెన్స్‌ జరుగుతుందని తెలిసింది. ఈ ప్రకారం చూసుకుంటే అక్కడి అవినీతిపరుల అక్రమార్జన ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఉద్యోగుల బిల్లుకు ఫిక్డ్స్‌ రేట్‌
వివిధ శాఖల ఉద్యోగుల వేతన, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, ఇతరత్రా బిల్లు చేసేందుకు ఇక్కడ ఫిక్స్‌డ్‌ రేట్‌ ఉన్నట్లు తెలిసింది. ప్రతి నెలా వేతన బిల్లుతో పాటు నిర్ధారించిన మొత్తాన్ని ఇవ్వాల్సిందే. లేదంటే బిల్లులో ఏదో ఒక కొర్రీ వేస్తారని ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు.

ప్రతి శాఖలోనూ మధ్యవర్తి
ఖజానా శాఖలో బిల్లులు క్లియరెన్స్‌ చేయించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక మధ్యవర్తి ఉంటాడు. అభివృద్ధి పనుల బిల్లులకు వీరు కాంట్రాక్టర్ల నుంచి లక్ష రూపాయల బిల్లుకు 0.5 శాతం పర్సంటేజీ తీసుకుంటారు. అందులో కొంత మొత్తాన్ని వాటాగా తీసుకుని ఖజానా శాఖకు చెల్లించాల్సిన వాటా ఇచ్చేస్తారు. ఉద్యోగుల వేతన బిల్లు అయితే పర్సంటేజీ రూపంలో కాకుండా ఒట్టి మొత్తంగా ఒక రేట్‌ నిర్ధారించి ఉంటారు.

అలవాటుపడిన  వైనం
ఖజానా శాఖలో బిల్లు క్లియరెన్స్‌ కోసం ముడుపులు ఇవ్వడం కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఆనవాయితీగా మారింది. లక్ష రూపాయలకు రూ.300 నుంచి రూ.500గా ఉండడంతో ఆ మొత్తాన్ని ఫైలుతో పాటు ముట్టచెబుతారని తెలిసింది. డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీతో వెనక్కి వస్తుంది. దాన్ని సరిచేసి మరోమారు ఉంచితే మరో కొర్రీ వేసి పదేపదే తిప్పుతారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఖర్చులు, సమయం వృథా. ఈ తిప్పలెందుకు పర్సంటేజీ పడేస్తే వాళ్లే అన్నీ సరిచేసుకుని బిల్లు చేస్తారనే ఉద్ధేశంతో ముడుపులు ఇవ్వడానికి అలవాటు పడిపోయారు.

హెచ్చరిక జారీ చేస్తాను
ఖజానా కార్యాలయాల్లో అవినీతిని సహించేది లేదు. ముడుపులు తీసుకుంటే చర్యలు తప్పవని జిల్లా ఖజానాతో పాటు ఉప ఖజానా కార్యాలయాల సిబ్బందికి హెచ్చరిస్తాను. బిల్లుల క్లియరెన్స్‌కు డబ్బులు అడుగుతున్నట్లు నా దృష్టికి వచ్చినా, వసూలు చేస్తున్నారంటూ ఎవరైనా ఫిర్యాదు వచ్చినా సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాను. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.
– బి.వి.ఎల్‌.కె.సుబ్రమణ్యేశ్వరశర్మ, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ఖజానా శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement