• ఒంగోలు నగరంలోని ఓ కల్యాణమండపంలో మంతనాలు
• ఆర్టీవోల ఇళ్లలో ఏసీబీ దాడులపై తీవ్ర చర్చ
ఒంగోలు సబర్బన్ : రవాణాశాఖ అధికారులు ఒంగోలులో రహస్యంగా సమావేశమయ్యారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని కార్గిల్ పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న కల్యాణమండపం ఇందుకు వేదికగా మారింది.
మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండానే సమావేశమైన ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. ఒంగోలు ఆర్టీవో ఎన్.రాంప్రసాద్‌తో పాటు నెల్లూరు ఆర్టీవో, నెల్లూరు జిల్లాకు చెందిన మరో బ్రేక్ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించిన ఇళ్లపై బినామీదారుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిని ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నారని కేసుల్లో రిమాండ్‌కు కూడా పంపించారు. ఈ నేపథ్యంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ రహస్య సమావేశం జరిగింది.
రవాణాశాఖ కమిషనర్ తీరుపై మండిపాటు..
రవాణాశాఖ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు కావడంతో పాటు ఆయన సొంత జిల్లాలో పని చేస్తున్న ఆర్టీవో, ఇన్‌చార్జి డీటీసీ ఎన్.రాంప్రసాద్‌ను ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ చేయడంతో పాటు సమీప జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో ఏసీబీ అధికారులు దాడులు చేయటం, రవాణాశాఖ అధికారుల్లో ఒక రకమైన భీతిని రేకెత్తించినట్లయింది. దీంతో రవాణాశాఖాధికారులు ఈ రహస్య సమావేశానికి వేదికగా మారింది. దీనికి తోడు జిల్లాకు చెందిన మంత్రి శిద్దా, రవాణాశాఖ రాష్ట్ర కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు మధ్య సఖ్యత లేదన్న అంశంపైనే రవాణాశాఖాధికారులపై ఏసీబీ దాడుల దాడులు జరుగుతున్నాయన్న దానిపై అధికారులు లోతుగా చర్చించుకున్నారు.
గత రెండేళ్లుగా రాష్ట్ర కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖలో మార్పులు తీసుకురావాలన్న అంశంపై రూ.కోట్లు సంపాదిస్తున్న అధికారులపై దృష్టి సారించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఏసీబీ అధికారుల దాడులు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలును కేంద్రంగా చేసుకొని బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు రహస్యంగా సమావేశమై దీనిపై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై కూడా వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.