ఖమ్మం : ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతల అరెస్ట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే బీబీనగర్, చౌటుప్పల్ టోల్గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మధిర సర్కిల్లో కూడా వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పౌర హక్కుల సంఘం నేత భూపతి, వామపక్ష నేత మల్లేశంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్లో ఛలో అసెంబ్లీకి బయలుదేరిన 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ఛలో అసెంబ్లీలో పాల్గొనేందుకు వచ్చిన 20 మంది విద్యార్థులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో శృతి, విద్యాసాగర్ రెడ్డి మరణించారు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆరోపించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయిన ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు.