జటిలం
జటిలం
Published Fri, Apr 21 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
- ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా
- పొంచి ఉన్న నీటి ముప్పు
- 200 గ్రామాల్లో తీరని దాహార్తి
- నిండని ఎస్‌ఎస్ ట్యాంకులు
- టీబీ డ్యాంలో అడుగంటిన నీరు
ఆదోని: జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్రం కానుంది. దాహారికి తీర్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు శుక్రవారం నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లోని 200 గ్రామాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాగునీటి కోసం రబీ పంటలను రైతులు త్యాగం చేశారు. దాదాపు లక్ష ఎకరాల్లో రబీ పంటలకు సెలవు ప్రకటించారు. పంటలు సాగు చేస్తే మొత్తం నీటిని వినియోగించుకోవాల్సి వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తుంగభద్ర రిజర్వాయర్‌లో ఏపీ వాటా కేటాయింపులో ఇంకా 2 టీఎంలసీల నీరు నిల్వ ఉన్నాయి. అయితే జిల్లా ప్రజల తాగు నీటి అవసరాల మేరకు నీటిని సరఫరా చేయకుండా అర్ధంతరంగా నిలిపి వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మూడు రోజుల్లోనే పడిపోయిన నీటి మట్టం
వేసవిలో ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలతో సహా 200 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. దీంతో ఈ నెల 9న టీబీ డ్యాం నుంచి 760 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అవి ఈ నెల 14న జిల్లా సరిహద్దుకు చేరుకున్నాయి. మొదటి మూడు రోజులు 350 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉండడంతో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఎస్‌ఎస్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కనీసం 10 రోజుల పాటు కాలువలో నీటి ప్రవాహం 350 క్యూసెక్కులు ఉంటే ఎస్‌ఎస్ ట్యాంకులను పూర్తిగా నింపుకోవచ్చు. అయితే నీటి సరఫరా ప్రారంభం అయిన మూడో రోజు నుంచే కాలువలో నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చింది. శుక్రవారం బోర్డు సరిహద్దు అయిన హానువాళు వద్ద కాలువలో నీటి మట్టం 290 క్యూసెక్కులకు పడిపోయింది. ఎగువన ఉన్న కర్ణాటకలో రాష్ట్ర వాటా నీటిని అక్రమంగా మళ్లించుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
దాహం తీరేదెలా..
జిల్లా పశ్చిమ ప్రాంతంలో 28 ఎస్‌ఎస్ ట్యాంకులు నిర్మించారు. వీటికి వారం రోజులుగా నీటిని నింపుతున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలలోని ఎస్‌ఎస్ ట్యాంకులకు రెండు రోజుల క్రితమే నీటి పంపింగ్ ప్రారంభం అయింది. మొత్తం 8 ట్యాంకులకు మాత్రం 50 శాతంకు పైగా నీటిని పంపింగ్ చేశారు. అయితే నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆదివారానికి నీటి మట్టం పూర్తిగా పడిపోతోంది. దీంతో నీటి పంపింగ్ కూడా నిలిచిపోతోంది. ప్రస్తుతం ఆయా ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరు నెలలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ట్యాంకులు ఖాళీ అయితే బిందెడు నీరు కూడా దొరక్క తాగు నీటి దాహార్తితో పడరాని పాట్లు పడాల్సి వస్తోందని ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
జలాశయం ఖాళీ
తుంగభద్ర జలాశయం ఖాళీ కావడంతో బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. కనీసం 2 టీఎంసీలు ఉండాల్సి ఉండగా తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1.75 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు వచ్చి జలాశయంలోకి ఇన్‌ఫ్లో పెరిగితే వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని బోర్డు అధికారులకు సూచించాం. ఇందుకు బోర్డు అధికారులు కూడా అంగీకరించారు.
- భాస్కరరెడ్డి, ఈఈ, ఆదోని తుంగభద్ర ప్రాజెక్టు
Advertisement
Advertisement