కలగా కంప్యూటర్ విద్య
నాలుగేళ్లుగా నిలిచిన బోధన
ఇన్‌స్ట్రక్టర్లు లేక ఇబ్బందులు
మూలనపడ్డ కంప్యూటర్లు
చెన్నూర్ రూరల్ : ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యనందిస్తామన్న ఆశయం నెరవేరడం లేదు. పలు పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించి చేతులు దులుపుకోవడంతో కంప్యూటర్ విద్య మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందనిద్రాక్షగా మారింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారి మూలనపడ్డాయి. జిల్లాలో 108 ఉన్నత పాఠశాలలు, 93 ప్రాథమికోన్నత, 477 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 55 ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను అందజేశారు. 2008లో ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, ఒక్కో జనరేటర్, ప్రింటర్లను అందించారు. కంప్యూటర్లు అమర్చేందుకు ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో 30 ఉన్నత పాఠశాలలకు గాను 15 పాఠశాలలకు కంçప్యూటర్లు అందజేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో 33 హైస్కూళ్లకు గాను 13 పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చారు. బెల్లంపల్లి నియోజవర్గంలో 31 ఉన్నత పాఠశాలలు ఉండగా 18 పాఠశాలలకు కంçప్యూటర్లను అందజేశారు. వీటి నిర్వహణను ఎడ్యుకామ్ అనే ప్రయివేట్ సంస్ధకు అప్పగించారు. వీరికి ఐదేళ్లు అంటే 2013 వరకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
ఈ సంస్థ నిర్వాహకులు కంప్యూటర్ బోధించేందుకు ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. వీరికి ఒక్కరికి నెలకు రూ.2476 చొప్పున వేతనం చెల్లించేవారు. మూడేళ్లపాటు కంప్యూటర్ విద్య సాఫీగానే కొనసాగింది. 2012లో వేతనాలు పెంచాలంటూ జిల్లా వ్యాప్తంగా ఇన్స్ర్‌క్టర్లు ఆందోళన చేపట్టారు. ఎడ్యుకామ్ సంస్థ పట్టించుకోకపోవడంతో ఇన్‌స్ట్రక్టర్లు తిరగి విధుల్లో చేరలేదు. దీంతో 2013 సెప్టెంబర్ నుంచి కంప్యూటర్ బోధన పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పాఠశాలల్లో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. కంప్యూటర్ విద్య కోసం విద్యార్థులు ప్రయివేట్ పాఠశాలలను ఆశ్రయించక తప్పడంలేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు నాలుగేళ్లుగా మూలన పడటంతో పనికి రాకుండా పోతున్నాయి. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య కలగానే మిగిలింది. అధికారులు స్పందించి కంప్యూటర్ బోధకులను నియమించి విద్యార్ధులకు కంప్యూటర్ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.