బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
Published Mon, Aug 1 2016 11:30 PM | Last Updated on Mon, Oct 8 2018 4:31 PM
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం
ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది
ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl
అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేష్టన్‌కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేష్టన్ నుంచి కొండమీదకు నడుపుతోంది.
సగం మందికే టిక్కెట్లు..
తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్‌లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేష్టన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్‌సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement