గందరగోళం
గందరగోళం
Published Wed, Jun 7 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
- బదిలీల షెడ్యూల్‌పై టీచర్ల పెదవి విరుపు
- ఈనెల 9 నాటికి రేషనలైజేషన్ పూర్తి
- 9 నుంచి 12 వరకు దరఖాస్తులు
- ఈనెల 30లోపు ప్రక్రియ పూర్తి
కర్నూలు (సిటీ): బదిలీల షెడ్యూల్ గందరగోళంగా ఉందని ఉపాధ్యాయులు పెదవి విరిస్తున్నారు. వేసవి సెలవుల్లోపే బదిలీలు పూర్తి చేస్తామని ప్రకటించిన మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. పాఠశాలలు ప్రారంభం కానున్న సమయంలో మంగళవారం షెడ్యూల్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల11వ తేదీ వరకు ఉపాధ్యాయులు శిక్షణలో ఉంటారు. అలాగే 12వ తేదీ స్కూళ్ల తప్పకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు ఫర్‌ఫార్మెన్స్ పాయింట్లకు చెందిన ఆధారాలు స్కూల్ రికార్డుల్లో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు భర్తీ చేయాలి.. ఎప్పుడు దరఖాస్తు చేయాలో అధికారులే చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సులతోనే ఇన్ని రోజులు షెడ్యూల్ ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బదిలీలకు స్పష్టమైన ఖాళీలను గుర్తించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో ఖాళీలు ప్రకటించిన నాటికి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఒక్క రోజు మాత్రమే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే బదిలీలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.
రేషనలైజేషన్ సాధ్యమయ్యేనా?
విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ ద్వారా టీచర్లను నియమించనున్నారు. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనతో ఈప్రక్రియలోకొంతమేరకు మార్పు చేశారు. ముందుగా ప్రకటించినట్లు స్కూళ్ల మధ్య ఉండే దూరం, ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితుల ఆధారంగా హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మార్గదర్శకాల్లో మార్పులు చేసి 10లోపు విద్యార్థులు ఉండే స్కూళ్లను తప్పని పరిస్థితుల్లో అయితే మూత వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో రాష్ట్రంలోనే అతితక్కువ ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం (సుమారు 10 పాఠశాలలు) ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలలు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల 42 పాఠశాలలు ప్రైమరీ స్కూళ్లుగా మారనున్నాయి.
మార్గదర్శకాలు ఇవీ..
- ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
- ఈనెల 11వ తేదీ జిల్లాలో స్పష్టమైన ఖాళీలను ప్రకటించాలి.
- ఈ నెల 10 నుంచి 13వ తేదీలోపు సీనియారిటీ లిస్టు తయారీ చేయాలి.
- 14వ తేదీన వెబ్‌సైట్‌లో ఫర్‌పార్మెన్స్ పాయింట్లతో కూడిన సీనియార్టీ లిస్టు ప్రదర్శించాలి.
- 15 నుంచి 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరణ, 17న డీఈఓ ద్వారా అభ్యంతరాలు స్వీకరణ,
- అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని బదిలీల్లో పాల్గొనే వారు కన్ఫర్మెషన్ 18లోపు చేయాలి.
- 19వ తేదీన పని ఆధారిత తదితర పాయింట్ల వివరాలతో కూడిన సీనియార్టీ తుది జాబితాను ప్రకటించాలి.
- 20 నుంచి 22వ తేదీన బదిలీలకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ నమోదు చేయాలి.
- 24వ తేదీ బదిలీ అయిన స్థానాలను ప్రకటించాలి.
- అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ ఫిర్యాదుల స్వీకరణ, 26, 27 తేదీల్లో ఫిర్యాదులపై జిల్లా స్థాయి కమిటీ పరిష్కారం చేయాలి.
- 28న తుది జాబితాను ప్రకటించి, 29, 30వ తేదీలలో వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు ప్రదర్శించాలి.
- జూలై 1వ తేదీన బదిలీ అయిన స్కూళ్లలో విధుల్లో చేరాలి.
Advertisement