కేసీఆర్ సంతకం పెడితే బాబు జైలుకే: రఘువీరా
అనంతపురం : 'ఓటుకు నోటు' కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద శాతం దోషి అని స్పష్టంగా తేలిందని, సంబంధిత ఫైలు తెలంగాణ సీఎం కేసీఆర్ టేబుల్ వద్ద ఉందని, సంతకం పెట్టిన మరుక్షణమే చంద్రబాబు చేతులకు సంకెళ్లు పడటం ఖాయమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు భయంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనకాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.
అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కారు అనేక అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్త్తిగా చట్టవిరుద్ధమని, రాష్ట్ర విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని పేర్కొన్నారు. వీటివల్ల రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా ఎనిమిది జిల్లాల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నా చంద్రబాబు మౌనం వహించడంపై రఘువీరా మండిపడ్డారు. చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ఏనాడూ తెలంగాణ చేస్తున్న అన్యాయంపై ఫిర్యాదు చేయలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెండు టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకుంటోందని అక్కడికెళ్లి అరెస్టై నానాయాగీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నా మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయంతోనే కేసీఆర్‌కు దాసోహమయ్యారని విమర్శించారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంపై శనివారం శ్రీశైలం డ్యాం వద్ద కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతులతో కలిసి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.