కుంభమేళా కాదు అన్నీ కుంభకోణాలే..!
- పుష్కర పనులు పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
మంథని/ధర్మపురి/మహదేవపూర్ : పన్నెండెళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిం చాల్సి ఉండగా.. ప్రభుత్వం రాజకీయ కోణంలో ముందుకుసాగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా రు. జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరంలో చేపట్టిన పుష్కరపనులను శుక్రవారం పరిశీలించారు. కుంభమేళా తరహాలో కాదు.. కుంభకోణాలే కనిపిస్తున్నాయన్నారు. సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం దేవాలయాలు, విగ్రహాలకు గులాబీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే దేవాదాయశాఖ నిద్రపోతుందా అని ప్రశ్నించారు.
పుణ్యస్నానానికి వచ్చే భక్తులపై గులాబీ రంగును హెలిక్యాప్టర్ ద్వారా చల్లే ప్రమాదం ఉందన్నారు.పనుల్లో నాణ్యత లేదని, పర్యవేక్షించే అధికారులే కరువయ్యూరన్నారు. కాంట్రాక్టర్లంతా ముఖ్యమంత్రి బంధువులేనన్నారు. స్వరాష్ట్రంలో మొదటిసారి వచ్చిన పుష్కరాలకు అత్యధిక నిధులు కేటాయిస్తారనుకుంటే అతి తక్కువ మంజూరు చేశారన్నారు. గతంలో నిర్మించిన ఘాట్లే తప్ప కొత్తవి లేవని, కేవలం మెట్లు మాత్రమే నిర్మిస్తున్నారన్నారు. పుష్కరాలకు రెండు రోజులే మిగిలి ఉండగా.. ఇంకా పనులు కొనసాగుతుండడం వింతగా ఉందన్నారు.
పనుల నాణ్యతపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. పుష్కరాల పనులపై నివేదిక తయూరు చేసి గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, డీసీసీ అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే, ముత్తారం జెడ్పీటీసీ సదానందం తదితరులు పాల్గొన్నారు.