జిల్లాల అప్పీళ్లపై అధికారులతో చర్చిస్తున్న డీఆర్వో శోభ
-
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేస్తున్న సిబ్బంది
-
అన్ని అభ్యంతరాలను పరిశీలించనున్న కలెక్టర్
-
ఆ తర్వాత కలెక్టర్ సంతకంతో అప్‌లోడ్
-
జిల్లాలో 1,047కు చేరిన అభ్యంతరాలు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అభ్యంతరాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లాల ఏర్పాటు అప్పీళ్ల కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో నమోదైన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే వచ్చిన మెుత్తం అప్పీళ్లను కలెక్టర్ పరిశీలించి రిమార్క్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి అవసరమైన వాటిని కలెక్టర్ సంతకంతో మళ్లీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అదేవిధంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కేంద్రంలో నేరుగా అందజేసిన అప్పీళ్ల కాపీలను కూడా అధికారులు కలెక్టర్ పరిశీలనకు ఉంచి అనంతరం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
సాంకేతిక సమస్యలు
జిల్లాలకు సంబంధించి వెబ్‌సైట్‌లో నమోదైన అప్పీళ్లను డౌన్‌లోడ్ చేయడం.. వాటిని కలెక్టర్ పరిశీలించాక మళ్లీ అప్‌లోడ్ చేయడం అధికారులకు తలకు మించిన భారంలా మారనుంది. ముఖ్యంగా సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా తొందరగా డౌన్‌లోడ్ కావడం లేదు. ఈక్రమంలో శుక్రవారం సుమారు 2గంటల పాటు ఈ పనిలో ఉన్న అధికారులు మొత్తంగా 50 అప్పీళ్లు కూడా డౌన్‌లోడ్ చేయలేకపోయారు. ఈ లెక్కన ఇప్పటివరకు నమోదైన 1,047 అప్పీళ్లను డౌన్‌లోడ్ చేసి పరిశీలించి అప్‌లోడ్ చేయడం ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్న దానిపై అధికారులతో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడారు. అలాగే, డీఆర్వో కార్యాలయంలో డీఆర్వో కె.శోభ, జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్ సమావేశమై అప్పీళ్ల పరిశీలనపై చర్చించారు.