కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
Published Sun, Nov 6 2016 10:20 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
–221 పోస్టులకు 40,032 మంది దరఖాస్తు
– పరీక్షకు హాజరైన అభ్యర్థులు 37,301 మంది
కర్నూలు: కానిస్టేబుళ్ల ఎంపికకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖలో 221 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 40,032 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలులో 35 సెంటర్లు 22,698 మంది, నంద్యాలలో 32 సెంటర్లలో 17,334 మంది కలిపి మొత్తం 71 సెంటర్లలో 37,301 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. 2731 మంది గైర్హాజరయ్యారు.
బయో మెట్రిక్ హాజరుతో అనుమతి :
కాకినాడ జేఎన్‌టీయూ కళాశాల ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. జిల్లాలోని ఇంజినీరింగ్, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. 250 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున ఏర్పాటు చేసి బయో మెట్రిక్ (వేలి ముద్రలు) సేకరణ ద్వారా వారిని పరీక్షలకు అనుమతించారు. పోలీసు శాఖ నుంచి కొంతమంది సిబ్బందిని (ఫింగర్ ప్రింట్స్ బృందం) నియమించి బయో మెట్రిక్ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయో మెట్రిక్ హాజరుతో అనుమతించి 10 గంటలకు పరీక్షలను ప్రారంభించారు. ఆధార్ లేదా, ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు మరిచిపోయి వచ్చారు. చివరి నిమిషంలో అలాంటి వారిని కూడా పరీక్షకు అనుమతించారు. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కర్నూలులోని పరీక్ష కేంద్రాలకు, నంద్యాలలోని ఆర్‌జీఎం కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అక్కడి పరీక్ష కేంద్రాలకు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.
ఎస్పీ, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీ:
కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్షను పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, ఏ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి స్కూలులో ఎస్పీ ఆకే రవికృష్ణ పరిశీలించారు. పరీక్ష బాగా రాసి పట్టుదలతో ఉద్యోగం సాధించాలని అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల యాజమాన్యంతో మాట్లాడి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, సీఐలు మహేశ్వరరెడ్డి, మధుసూదన్‌రావు, ఈ–కాప్స్ ఎస్‌ఐ రాఘవరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐలు, సీఐలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Advertisement