సోమవారం నుంచి కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలు
సోమవారం నుంచి కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలు
Published Sun, Dec 4 2016 9:46 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
* ఉదయం ఆరు గంటలకే ప్రారంభం
* గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల హాజరుకానున్న అభ్యర్థులు
పట్నంబజారు: కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించి సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. గుంటూరులోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో అభ్యర్థులకు ఉదయం ఆరు గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య, దానికి అణుగుణంగా పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు చేశారు. గత నెల 6వతేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా మొత్తం 41,910 మందికిగాను 36,832 మంది హాజరయ్యారు. వారిలో సుమారు 11వేల మందికిపైగా దేహదారుఢ్య, లాంగ్, హైజంప్, 100, 1600 మీటర్ల పరుగు పరీక్షలకు అర్హత సంపాదించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. నిత్యం వెయ్యి మంది వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందటే రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్ పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లోని ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు అందుబాటులో గ్లూకోజ్, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయటంతో పాటుగా, త్వరితగతిన పరీక్షలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లును పరిశీలించారు. పలువురు ఉన్నతాధికారులు పరీక్షలకు పర్యవేక్షణాధికారులుగా వ్యవహరించనున్నారు.
Advertisement
Advertisement