సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి.
వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్‌లైన్‌లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది.
లక్ష మందికి పైగా..
- మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా.
- దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి.
- వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్‌టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.
- గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది.
- సొంత జిల్లాలో చాన్స్ మిస్..
- టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది.
- ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
- అవకాశం ఉన్నా..
- మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.
- మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్‌తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
(చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!)
Comments
Please login to add a commentAdd a comment