సమస్యలు పరిష్కరించాల్సిందే
-
మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపిన జేసీసీ నాయకులు
-
నేడు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల బంద్‌కు పిలుపు
నెల్లూరు(పొగతోట) : కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరాహారదీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం మద్దతు తెలిపారు. తొలుతగా జేఏసీ నాయకులు వారికి మద్దతుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారితో కలిసి కలెక్టరేట్ ఎదుట కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకుని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి.అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కారం కోసం గురువారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల బంద్‌కు పిలుపునిస్తున్నామని తెలిపారు. 12 రోజులుగా వీరు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు పవన్, సాయి, ఆదిశేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.