ఇలాగైతే ఎలా?
సమ్మెలో అధ్యాపకులు.. సాగని తరగతులు
అయోమయంలో ఇంటర్ విద్యార్థులు
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె తప్పదంటున్న అధ్యాపకుల జేఏసీ
రాయవరం : కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మెబాట పట్టడంతో జూనియర్ కళాశాలల్లో తరగతులు సాగడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ అధ్యాపకుల జేఏసీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ దశల వారీ పోరాటానికి కాంట్రాక్టు అధ్యాపకులు దిగారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. దీని ప్రభావం జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలల విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 40 ప్రభుత్వ జూనియర్, 15 డిగ్రీ, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరంతా 16ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా రెగ్యులర్ కాకపోతాయా..అన్న ఆశతో వీరు చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ అవుతాయన్న ఆశలు అడియాశలు కావడంలో పోరుబాట పట్టారు.
80వేల మంది విద్యార్థులపై ప్రభావం..
ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని, నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తోంది. మరో పక్క కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరన్న వాస్తవాన్ని చెప్పడం లేదు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే ఇప్పుడు కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో తమ చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. సబ్జెక్టు చాప్టర్‌లు కూడా పూర్తికాలేదని, ఇప్పుడు అధ్యాపకులు సమ్మెతో సిలబస్ ఎలా పూర్తవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. సమ్మెపై ప్రభుత్వం స్పందించక పోవడం..అధ్యాపకులు సమ్మె విరమించేది లేదని భీష్మించడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 80వేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.