ఏటా అదే తంతు.. | contract lecturers free service summer | Sakshi
Sakshi News home page

ఏటా అదే తంతు..

Published Sat, May 27 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

ఏటా అదే తంతు..

ఏటా అదే తంతు..

వేసవిలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఉచిత సేవలు
జిల్లాలో 348 మందికి తప్పని అవస్థలు
నెరవేరని ప్రభుత్వ హామీ
 
కాంట్రాక్టు అధ్యాపకులు.. విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున వారిని విధుల నుంచి తొలగిస్తారు. అలాగని వేసవి సెలవుల్లో వారిని ఖాళీగా కూర్చోనివ్వరు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. సెలవుల్లో వీరితో పనులు చేయించుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం.. వీరి విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తోంది. ఏటా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఇదీ.
 
రాయవరం (మండపేట) : జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 348 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్మీడియేట్‌ పరీక్షలు పూర్తి కాగానే ఈ ఏడాది మార్చి 28 నుంచి వారిని విధుల నుంచి తొలగించారు. తిరిగి జూన్‌లో రెన్యువల్‌ చేస్తామంటూ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించినప్పటికీ పనుల నుంచి మాత్రం తొలగించలేదు. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు వారు ఇంటర్మీడియేట్‌ మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు క్యాంపైన్లలో నిమగ్నమయ్యారు. కళాశాలలో తగిన విద్యార్థుల సంఖ్య లేకుంటే పోస్టులు ఉండవన్న బెదిరింపుల నేపథ్యంలో, విద్యార్థులను చేర్పించేందుకు వారు కళాశాలల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటర్మీడియేట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను జూన్‌ 15 నుంచి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు వీరే సిద్ధం చేయాలి. ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు, సప్లమెంటరీ పరీక్షలకు ఇన్విజిలేటర్‌ విధులు కూడా వారే నిర్వర్తించాలి. విధుల నుంచి తొలగించిన తర్వాత రెండు నెలలుగా ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. ఈ పనులు చేసినందుకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. 
హామీలేమయ్యాయి? 
కనీస వేతనాలు చెల్లించాలంటూ గతేడాది డిసెంబర్‌ రెండు నుంచి జనవరి 4వ తేదీ వరకు 32 రోజుల పాటు కాంట్రాక్టు అధ్యాకులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. బెదిరింపులకు దిగినా దీక్షలు విరమించకపోవడంతో చేసేదీమీ లేక కనీస వేతనం, డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించినా.. జీఓ మాత్రం విడుదల కాలేదు. 
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
 తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేయడంతో ఆ రాష్ట్ర అధ్యాపకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ఒకసారి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు వేతనాలను పెంచారు. తిరిగి కనీస వేతనం రూ.37,100 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం అటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి కాంట్రాక్టు అధ్యాపకుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మోసగిస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. 
17 ఏళ్లుగా పనిచేస్తున్నాం..
కాంట్రాక్టు అధ్యాపకులుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేక పోతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చెబుతున్న ప్రభుత్వం మా విషయంలో అమలు చేయకపోవడం దారుణం. 
– పందిరి సాంబశివమూర్తి, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండపేట
జీఓ విడుదల చేయాలి..
వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేయాలి. పక్క రాష్ట్రంలో జీతాలు పెంచుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలవుల్లో విధుల్లో ఉన్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. 
– యార్లగడ్డ రాజాచౌదరి, 461 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement