కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె విరమణ
కంబాలచెరువు : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 33 రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మె బుధవారం విరమించారు. ఈ మేరకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి హేప్సీరాణిని కలిసి సమ్మె విరమణ పత్రం అందజేశారు. స్పెషల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్టు ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు యార్లగడ్డ రాజాచౌదరి, వి.కనకరాజు తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారందరికీ మూడు దశలుగా టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సంక్రాంతి సెలవులు అనంతరం జీవోను విడుదల చేస్తామని చెప్పారన్నారు. సమ్మె కారణంగా విద్యార్థులు వెనుకబడిన పాఠాలను అదనపు తరగతుల ద్వారా బోధిస్తామని చెప్పారు. తమ సమ్మెకు మద్దతిచ్చిన విద్యార్థి, కార్మిక, ప్రజాసంఘాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జి.ఎల్.మాణిక్యం, కె.ఎన్.వి.ఎల్.నరసింహం, లక్ష్మణరావు, గణేశ్వరరావు, ప్రకాశ్‌బాబు, రెడ్డి రాజబాబు పాల్గొన్నారు.