ఆశ.. నిరాశ
ఆశ.. నిరాశ
Published Thu, Jun 8 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
శ్రమ దోపిడీకి గురవుతున్న ఆశ వర్కర్లు
అరకొరగా వేతనాలు
జిల్లాలో 5 వేల మందికి పైగా ఉన్న ఆశ వర్కర్లు ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నారు. బండెడు చాకిరీ వీరితో చేయించుకుంటున్న ప్రభుత్వం.. వీరికి అరకొరగా వేతనాలను చెల్లిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులకు వీరు చేసే సేవల ఆధారంగా వీరికి వేతనం ఇస్తున్నారు. వీరు చేసే సేవలు.. అందుకు రేట్ల జాబితా పరిశీలిస్తే ప్రభుత్వం వీరి పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుస్తుంది. చేసిన సేవల ధ్రువీకరణకు వీరు పడుతున్న పాట్లు దయనీయంగా ఉంది. ఇంతా చేస్తే వారికి నెలకు అందేది రూ.వెయ్యి లోపే. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో రూ.6 వేలు ఇస్తుండగా రాష్ట్రంలోనే వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస వేతనం రూ.6 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : మండలం, గ్రామాల పరిధిలో వెయ్యి మంది జనాభా ఉన్న ప్రాంతాలను ఆశ వర్కర్లకు అప్పగిస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్నారు. గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా వారిని ప్రోత్సహిస్తారు. నవజాతి శిశువు సంరక్షణ, తల్లి, బిడ్డకు నెలనెలా వ్యాధి నిరోధక టీకాలు, మిజిల్స్ వేసేందుకు ఆస్పత్రులకుకు తీసుకువెళ్తారు. నవజాతి శిశువు నుంచి ఐదేళ్లు వచ్చేవరకూ వారి హెల్త్ కార్డు ఆధారంగా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తారు. వీటితో పాటు ప్రభుత్వం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో కూడా సేవలు అందిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ సర్వేలలో వీరి సేవలు అమూల్యం.
తగ్గిన మాతా శిశు మరణాలు
ఆశ వర్కర్ల నియామకం తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగిట్టు, మాతా శిశు మరణాలు తగ్గినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. బాలింతలకు తీసుకునే పౌష్టికాహారం, మందులు వాడే విధానం తదితర అంశాలపై గ్రామాల్లో వీరు బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు.
చాలీచాలని వేతనాలు
అశ వర్కర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ప్రతి సేవకు నామమాత్రపు రేటు పెట్టడంతో వీరికి నెలకు అంతంతమాత్రమే ఆదాయం వస్తోంది. గర్భిణులు మొదటి మూడు నెలల లోపు పేరు నమోదు చేసినందుకు రూ. 40లు ఇస్తారు. గర్భిణులకు నాలుగుసార్లు పరీక్షలు చేయించి, రెండు డోసులు టీటీ ఇంజక‌్షన్లు, 120 రోజుల ఐఎస్‌ఏ మాత్రలు పూర్తిగా వాడిస్తే రూ.160 ఇస్తారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయిస్తే రూ.200 ఇస్తారు. బాలింత సేవ, నవజాతి శిశువు సంరక్షణ ఒకసారికి రూ.40 చొప్పున, 5, 6 సందర్భాలకు రూ.50 చొప్పున మొత్తం రూ.250 ఇస్తారు. ప్రసవం అనంతరం వచ్చే సమస్యలకు సీఎంఓఎన్‌సీ సెంటర్లుకు తరలిస్తే రూ.50లు ఇస్తారు. నవజాతి శిశువు బరువు 2 కేజీల కంటే తక్కువ ఉన్నప్పుడు సబ్ సెంటర్లకు లేదా జీజీహెచ్, ఎఫ్‌ఆర్‌యూ యూనిట్‌కు రిపోర్టు చేసినందుకు రూ.25, ఫాల్‌ఆఫ్ చేసినందుకు రూ.100 ఇస్తారు. వెయ్యి మంది జనాభాలో ఇలా సేవలు అందించినందుకు వారికి నెలకు కనీసం రూ.వెయ్యి కూడా అందడం లేదు.
సంతకాల కోసం ఛీత్కారాలు
గ్రామాల పరిధిలో కిలోమీటర్లు కొద్ది నడిచి సేవలు అందిస్తే వచ్చే వేతనాలు నామమాత్రమే. అయితే ఈ సేవలు చేసినట్టుగా తయారుచేసిన రిపోర్టు ధ్రువీకరణకు సంతకాల కోసం వీరు పడరాని పాట్లు పడుతున్నారు. వీరి సేవలకు ప్రతి నెలా రిపోర్టు సమర్పించాలి. వీరు చేసిన సేవలు, వాటి రేట్లకు తొలుత గ్రామ సర్పంచ్ లేదా వార్డు సభ్యుడితో సంతకం చేయించాలి. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్, హాస్పిటల్‌లోని ఏఎన్‌ఎం, హాస్పిటల్ వైద్యుడితో సంతకాలు పెట్టించాలి. ఆ తరువాత సూపర్‌వైజర్, మెడికల్ ఆఫీసర్‌తో సంతకాలు పెడితే తప్ప వీరికి వేతనం చేతికి అందదు. సంతకాలు పెట్టేందుకు వేధింపులు, ఛీత్కారాలను వీరు భరించాల్సిందే. సంతకాల కోసం వారు రోజుల తరబడి వారి చుట్టూ తిరగాల్సివస్తోందని వాపోతున్నారు.
Advertisement
Advertisement