కార్మికుల సంక్షేమానికి తూట్లు | special story chandranna bheema | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమానికి తూట్లు

Published Sun, Mar 5 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

కార్మికుల సంక్షేమానికి తూట్లు

కార్మికుల సంక్షేమానికి తూట్లు

చంద్రన్న బీమాకు నిధుల మళ్లింపు
బాబు తీరుపై నేడు ‘చలో కలెక్టరేట్‌’కు కార్మిక సంఘాల పిలుపు
కపిలేశ్వరపురం (మండపేట) : ఆయనో మాటల మాంత్రికుడు..చేసేవన్నీ పాత పనులే అయినా కొత్తవని చెప్పేందుకు తాపత్రయపడతాడు. అందుకు తన అనుభవాన్నంతా రంగరించి కొత్త పథకాలను తయారు చేస్తాడు. దానికి తన పేరు జోడించుకుని ప్రచారం ఊదరకొడతాడు.. అలా పుట్టుకొచ్చిందే చంద్రన్న బీమా పథకం...దీని ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములు ప్రభుత్వం కొత్తగా కేటాయించిన సొమ్ములు కావు. ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డువి. బోర్డు నిధులు ఆ కార్మికులు కోసం మాత్రమే ఖర్చు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పక్కనపెట్టి నిధులను మళ్లింపునకు పాల్పడ్డాడు. ఇదేం ఘోరమంటూ భవన నిర్మాణ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో జీపు జాతా నిర్వహిస్తూ ప్రభుత్వం మోసకారితనాన్ని ఎండగడుతున్నారు. కార్మికులంతా సోమవారం ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. 
భవనం నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ గల 33 రకాలు పనివారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షలు మంది ఉన్నారు. అత్యధికంగా తాపీ, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, రాడ్‌ బెండింగ్, టైల్స్, మార్బుల్‌ పనివారు, కూలీలు ఉంటారు. వీరి సంక్షేమం కోసం  కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పలు విధాల ఆదుకునే ఏర్పాటు చట్టం కల్పించింది. 
సంక్షేమ బోర్డు నిధులు మళ్లింపు ఇలా..
318/2011 నంబరుగల కేసులో 2013 నంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు తగిన ఉత్తర్వులు కూడా అందాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ట్రాన్స్‌పోర్టు బీమా కోసం రూ.71 కోట్లను, చంద్రన్న బీమా పేరుతో రూ.241 కోట్లను ఇన్సూరెన్స్‌æ కంపెనీకి చెల్లించింది. చంద్రన్న బీమా పథకం ప్రచారానికి రూ.31 కోట్లు ఖర్చు చేసింది. చలివేంద్రాలు పేరుతో రూ.20 కోట్లు ఆస్పత్రుల్లో డెలివరీ కిట్లు పేరుతో మరో రూ. 20 కోట్లు మళ్లించింది. రూ.1300 కోట్ల సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం ఖజానా పీడీ అకౌంట్‌కు మళ్లించేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. 
చంద్రన్న బీమా సంగతి ఇదీ..
సంక్షేమ బోర్డు చట్టపరిధిలోనిది కావడంతో శాశ్వత ప్రయోజనాలను కార్మికులు పొందే వీలుంటుంది.. చంద్రన్న బీమా కేవలం ఓ పథకం మాత్రమే. అందుకే చంద్రన్న బీమా పేరుతో సంక్షేమ బోర్డును తమకు దూరం చేయవద్దంటూ కార్మికులు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. అందుకు వారు చెప్పే వివరాలు ఇలా ఉన్నాయి...2016 అక్టోబరు రెండున ప్రారంభమైన చంద్రన్న బీమా పథకం అమలుతో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం ప్రారంభం కారణంగా సంక్షేమ బోర్డులో నుంచి ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత అంగవైకల్యాలకు సాయమందించడం తొలగించి చంద్రన్న బీమా పథకం ద్వారా క్లెయిం చేసుకోమని మెమో 3549ను జారీ చేశారు. సంక్షేమ బోర్డులో సహజ మరణానికి రూ.80 వేలు పొందే వీలు కాస్తా చంద్రన్న బీమా రూ.30 వేలుకు తగ్గిపోతుంది. రూ.50 వేలు నష్టపోతున్నాడు. సంక్షేమ బోర్డులో శాశ్వత అంగ వైకల్యానికి రూ.ఐదు లక్షలు వరకూ అందే సాయం కాస్తా ఈ బీమాలో రూ.3,62,500 మాత్రమే అందుకుంటాడు. 
అధికారుల నిర్లక్ష్యం
పథకాల లబ్దికి కార్మికుడు ఉన్న సమీపంలోని లేబర్‌ కార్యాలయంలో తన పేరుతును నమోదు చేయించుకుని గుర్తింపు కార్డు పొందాలి . దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోగా గుర్తింపుకార్డు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఆరేడు నెలలకు కానీ కార్డు రాని పరిస్థితి. కాన్పు ఖర్చులు పొందేందుకు బర్త్‌ సర్టిఫికెట్‌ జత చేయాలంటూ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. 
సమరానికి సన్నద్ధం 
సీఈటీయూ అనుబంధ ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుంచి జీపు జాతాను నిర్వహిస్తూ ప్రజా వ్యతిరేక చంద్రబాబు విధానాలపై ప్రచారం చేస్తున్నారు. సోమవారం చలో కాకినాడ పేరుతో కలెక్టరు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని రూపొందించారు.
కార్మికుల డిమాండ్లు ఇవే..
చంద్రన్న బీమా పథకానికి మళ్లించిన రూ.241 కోట్లను సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. 
పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి.
60 ఏళ్లు నిండిన కార్మికునికి రూ.మూడు వేలు గ్యారంటీ పింఛను ఇవ్వాలి. 
ఈఎస్‌ఐ, గృహ నిర్మాణ రుణాలను అందజేయాలి. 
పెద్ద నోట్లు సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ. పదివేల చొప్పున సంక్షేమ బోర్డు నిధుల్లోంచి అందజేయాలి. 
జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం 
చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం. వారితో ఉమ్మడి కార్యాచరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చే ఆలోచన చేస్తున్నాం. సోమవారం నిర్వహించే చలో కలెక్టరేట్‌కు కార్మికులను సన్నద్ధం చేస్తున్నాం.
- చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement