వెన్ను తడితేనే ఉన్నతి
వెన్ను తడితేనే ఉన్నతి
Published Sun, Jun 25 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM
-పిల్లల అభిరుచులు, శక్తియుక్తులను గుర్తించాలి
-క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛను అలవరచాలి
-తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం
రాయవరం (మండపేట) : ఆకుల హరితం, పువ్వుల పరిమళం, వాటి రంగులు, ఫలాల మాధుర్యం, కాండం దారుఢ్యం.. వంటివన్నీ విత్తనంలోనే దాగి ఉంటాయి. నేలా, నీరూ, గాలీ, వెలుతురూ అన్నీ అనుకూలిస్తేనే విత్తు మొలకెత్తి, పెరిగి పూలూఫలాలూ ఇస్తుంది. అలాగే చిన్నారులకు పుట్టుకతోనే జిజ్ఞాస, దానికి అనుగుణంగా జ్ఞానగ్రహణ, ధారణ శక్తి (ఐక్యూ) వంటివి ఉంటాయి. వాటిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి నచ్చిన రంగంలో రాణిస్తారంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు రోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి. వారిని నిశితంగా గమనిస్తూ, వారి అభిరుచులను, శక్తియుక్తులను తెలుసుకోవాలి. కార్పొరేట్ చదువుల మోజులో పడి పిల్లలపై ఒత్తిడి పెంచరాదు. వారి వికాసానికి అవసరమైన స్వేచ్ఛనిస్తూనే క్రమశిక్షణ అలవాటు చేయాలి. ఇంటివద్ద తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లల ఉన్నత భవిష్యత్‌కు పునాదులు వేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఇష్టంతో చదివేలా చేయాలి..
పాఠశాలకు వెళ్తున్న పిల్లలను తల్లిదండ్రులు గమనించాలి. వారు ఎంచుకునే స్నేహితులపై అప్రమత్తంగా ఉండాలి. బాగా చదువుకున్న వారితో స్నేహం చేసే పిల్లలు కూడా అదే రీతిలో కష్టపడి చదువుతారు. పెంకి పిల్లలతో కూడితే అవే అలవాట్లు వస్తాయి. పిల్లలపై ఒత్తిడి లేకుండా మెల్లగా వారి నుంచి దూరం చేయాలి. కొందరు పిల్లలు క్యారేజీ పట్టుకుని వెళ్తారు. కానీ సరిగ్గా తినరు. అటువంటి చిన్నారులపై ఓ కన్నేయాలి. వారు ఆహారం సక్రమంగా తినేలా శ్రద్ధ చూపాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిస్సత్తువగా ఉంటూ చదువుపై శ్రద్ధ చూపరు. పిల్లలు పెద్దలను గౌరవిస్తున్నారా, లేదా, పాఠశాలలో ఉపాధ్యాయులతో ఎలా మెలగుతున్నారు అన్నది తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు ఏ సబ్జెక్టుపై అభిరుచి చూపుతున్నారో గుర్తించాలి. దానిలో ప్రోత్సహిస్తూనే మిగిలిన సబ్జెక్టుల ఆవశ్యకతను వివరించాలి. ఆటల్లో ఉత్సాహం చూపే వారిని ప్రోత్సహించాలి. అదే స్థాయిలో చదువు విలువనూ తెలియజేయాలి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజు ఏ పాఠ్యాంశాలు చెప్పారో అడగాలి. దీని వల్ల క్రమశిక్షణ, బాధ్యత అలవడుతాయి. నేర్చుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది. చిన్న చిన్న బహుమతులతో పిల్లలను ప్రోత్సహించాలి. దీని వల్ల వారిలో నూతనోత్తేజం కలుగుతుంది. వంద దూషణల కంటే ఓ బహుమతి ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇంటి వ్యాపకాలను పిల్లలకు అంటకట్టకూడదు. తల్లిదండ్రులు బాధ్యతగా మెలగితే పిల్లలు కూడా దానినే అలవాటు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచే వారిలో సామాజిక సేవా భావాన్ని పెంపొందించాలి. ఇది నాయకత్వ లక్షణాలనూ వికసింపజేస్తుంది. ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు మార్గం చూపుతుంది. నైతిక ప్రవర్తనను అలవరుస్తుంది. తల్లిదండ్రులు నెలలో ఒకసారైనా పాఠశాలకు వెళ్లాలి. పిల్లల చదువుపై ఉపాధ్యాయులతో వాకబు చేయాలి. దీనివల్ల పిల్లల్లో భయమూ, బాధ్యతా పెరుగుతాయి. సక్రమంగా మెలగకపోతే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతారని గుర్తిస్తారు. క్రమశిక్షణతో మెలగుతారు. పిల్లలను సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌తో గంటల తరబడి గడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే చదువులో వెనుకబడడం ఖాయం.
ఒత్తిడి పెంచరాదు..
పిల్లలు సక్రమంగా పాఠశాలకు రాకపోయినా, సరిగ్గా చదవక పోయినా ఉపాధ్యాయులు శిక్ష విధించడం సరికాదు. దీనివల్ల పిల్లలు మరింత మొండిదేరుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి ప్రవర్థనకు గల కారణాలను తెలుసుకుని సరిచేస్తే పిల్లల ప్రవర్తనలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. చదువుకు ప్రాధాన్యమిస్తారు. పాఠశాల టైమ్‌టేబుల్ పాటించేలా చూడాలి. సమయానికి పాఠశాలకు చేరుకుంటే వారిలో క్రమశిక్షణ ఉన్నట్లే. తరచూ ఆలస్యంగా వస్తుండడం, ఉపాధ్యాయులతో సరిగా ఉండక పోవడం, పాఠ్యాంశాలను వినకపోవడం వంటివి చేస్తుంటే తల్లిదండ్రులతో మాట్లాడాలి. పిల్లలు ఇంటి దగ్గర కంటే పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతారు. వారి భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఉపాధ్యాయులు సుల¿¶భ పద్ధతుల్లో బోధిస్తే వారిని అమితంగా ఇష్టపడతారు. వారి నుంచి మంచి ప్రవర్తననూ అలవాటు చేసుకుంటారు. ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహంగా మెలగాలి. చదువుకు సంబంధించి వారి సమస్యలను, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. ఉన్నత చదువులపై ఆసక్తిని పెంచాలి. ఉద్యోగ సాధనకు అవసరమైన సామర్థానికి పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి. పుస్తక పఠనాన్ని పెంపొందించాలి. గ్రంథాలయంపై అవగాహన పెంచాలి. పాఠ్యాంశాలు పిల్లలందరికీ వినిపించేలా, అర్థమయ్యేలా బోధించాలి. అప్పుడే ఫలవంతమైన తరగతి గది నిర్వహణ సాధ్యమవుతుంది. తరగతి గదిలో తరచూ అల్లరి చేస్తున్న వారిని, చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపే వారిని గుర్తించి వారికి హితబోధ చేయాలి.
ప్రాథమిక స్థాయి కీలకం..
పిల్లల తెలివితేటలలను ప్రాథమిక స్థాయిలోనే తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రతిరోజూ కొంత సమయం పిల్లలకు కేటాయించి వారి అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల అభిరుచులను పిల్లలపై రుద్దరాదు. పిల్లల అభిరుచులకు, వారి లక్ష్య సాధనకు అవసరమైన ప్రణాళికలు సమకూర్చాలి. అతి గారాబం తగదు.
– కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం
Advertisement