ఆర్థిక లావాదేవీలతోనే..
Published Thu, Nov 24 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
భువనగిరి అర్బన్ : బాకీ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నాడే కారణంతోనే కాంట్రాక్టర్ హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 18వ తేదీన బొమ్మలరామారం గ్రామ శివారులో వెలుగుచూసిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ పాలకుర్తి యాదగిరి బుధవారం తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన గుండుగ బ్రహ్మాజీరావు(45) రోడ్డు కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2008 సంవత్సరంలో నాగిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తితో బ్రహ్మజీరావుకు పరిచయం ఏర్పడింది.
అయితే నాగిరెడ్డి రాంరెడ్డికి ఉన్న టిప్పర్ లారీని బ్రహ్మాజీరావు మధ్యవర్తి సాయంతో రోడ్డు పనులకు ఎంగేజీకు పెట్టి కంకరపోయించారు. ఆ విషయంలో నాగిరెడ్డి రాంరెడ్డికి సుమారు రూ.13లక్షల వరకు కాంట్రాక్టర్ బకాయి ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ డబ్బులను ఇవ్వడం లేదు. ఆ డబ్బులను బ్రహ్మజీరావు ఇచ్చే విధంగా ఒప్పుకుని ప్రామిసరి నోటు, చెక్కులు ఇచ్చినా కూడా డబ్బులు ఇవ్వలేదు. రాంరెడ్డి తన డబ్బులు చెల్లించాలని బ్రహ్మాజీరావును ఎన్నిసార్లు అడిగినా రేపుమాపు అంటూ తిప్పుతున్నాడు. దీంతో రాంరెడ్డి విసుగుపోయి బ్రహ్మజీరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
బైటికి వెళ్దామని తీసుకొచ్చి..
రాంరెడ్డి 17వ తేదీన హబ్సిగూడలో ఉన్న బ్రహ్మజీరావు ఇంటికి వెళ్లాడు. పని ఉంది బైటికి వెళ్దామని నమ్మించి బ్రహ్మాజీరావును తన బైక్ ఎక్కించుకుని బయలుదేరా డు. కీసరలో లీటర్ పెట్రోల్ బైక్‌లో పోసుకున్నాడు. బొమ్మలరామారం గ్రామ శివారులోని బెజ్జంకి నర్సిరెడ్డి బీడు భూములోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సుత్తెతో అతడిపై దాడి చేశాడు. అలాగే కిందపడవేసి గొంతునులిమి చంపేశాడు. ఆపై శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ మృతుడి ఒంటిపై పోసి తగులబెట్టి పరారయ్యాడు.
సెల్‌ఫోన్ ఆధారంగా..
మృతదేహం సమీపంలో బ్రహ్మాజీరావు సెల్‌ఫోన్ పోలీసులకు లభించడంతో కేసు ఛేదన సులువైంది. అతడి కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతదేహం బ్రహ్మాజీరావుదేనని, 17న ఉదయం రాంరెడ్డి తీసుకెళ్లాడని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడని డీసీపీ యాదగిరి వివరించారు. నిందితుడి వద్ద నుంచి మోటార్ సైకిల్, హెల్మెట్, సుత్తి, సెల్‌ఫోన్, డ్రెస్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఏసీపీ మోహన్‌రెడ్డి, భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్ ఉన్నారు.
Advertisement
Advertisement