ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు
* పోలీసు బందోబస్తు మధ్య నయీమ్ మృతదేహం భువనగిరికి తరలింపు
* నయీమ్ భార్య, పిల్లల్ని తీసుకొచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమన్న బంధువులు
* మత పెద్దలు, కుటుంబ సభ్యులతో పోలీసుల చర్చలు
* రాత్రి 10.21 గంటలకు ఖాజీ మహల్లా దర్గాలో ఖననం
భువనగిరి: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నయీమ్ అంత్యక్రియలు తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం రాత్రి ముగిశాయి. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మృతి చెందిన విషయం తెలిసిందే.
సోమవారం రాత్రే నయీమ్ మృతదేహానికి షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం ఉదయం నయీమ్ సోదరి, బావ వచ్చి మృతదేహాన్ని తీసుకుని... మధ్యాహ్నం భువనగిరిలోని నయీం ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు నయీమ్ ఇంటివద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత నయీమ్ తల్లి తాహెరాబేగం, బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే నయీమ్ భార్య ఫర్హానా, పిల్లలు, నయీం సోదరిలను తీసుకువచ్చే వరకు అంత్యక్రియలు జరపబోమని కుటుంబ సభ్యులు తొలుత ప్రకటించారు.
నయీమ్‌ను కడసారి చూసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో.. ఏఎస్పీ గంగాధర్, యాదగిరిగుట్ట డీఎస్పీ సాధుమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముస్లిం మత పెద్దలు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. నయీమ్ భార్య పోలీసు కేసులో ఉన్నందున ఆమెను తీసుకురావడం వీలుకాదని వివరించారు. అత్యవసర సమయంలో భార్య లేకున్నా అంత్యక్రియలు చేయవచ్చని మత పెద్దలు సూచించడంతో..
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. చివరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరో సమీప బంధువు రావాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని కోరారు. రాత్రి 8.45 సమయంలో అంత్యక్రియలను ప్రారంభించారు. స్థానిక ఖాజీ మహెల్లా దర్గా మసీదులో జనాజున్ నమాజ్ నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న శ్మశాన వాటికలో 10.21 గంటలకు ఖననం చేశారు.
ముందుగానే సమాధి స్థలం ఎంచుకున్న నయీమ్
నయీం మరణించడానికి ముందే తన సమాధి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. తన తండ్రి ఖాజా నసీరుద్దీన్, సోదరులు అలీమోద్దీన్, సమీ సమాధుల పక్కన తనను సమాధి చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఆ ప్రకారమే కుటుంబ సభ్యులు నయీం మృతదేహాన్ని సమాధి చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా అంత్యక్రియలు పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నయీమ్ అనుచరులు, మాజీ నక్సలైట్లు జనంలో కలసి అంత్యక్రియలకు రావొచ్చనే ఉద్దేశంతో పోలీసులు అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు.
వారం పాటు గ్రామాల్లోకి వెళ్లొద్దు
అధికార పార్టీ నేతలకు పోలీసుల హెచ్చరిక
నయీమ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులెవరూ నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా భువనగిరి, మునుగోడు, న ల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో నయీమ్ అనుచరుల కదలికలు ఉంటాయనే అనుమానంతో అంతర్గతంగా ఈ హెచ్చరికలు చేసినట్లు సమాచారం. వారం రోజుల పాటు తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీ నేత లు కొందరు హైదరాబాద్‌కు పరిమితమైనట్లు సమాచారం.