తిరువళ్లూరు: తల్లి మృతి చెందిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే ఆమె ప్రాణంతో ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్(56)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సేలై కండ్రిగలోని చిన్న కుమారుడు శరవణన్ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సొక్కమ్మాల్‌కు, ఎదురింటి మహిళకు ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో సొక్కమ్మాల్ స్వల్పంగా గాయపడడంతో అలిగి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు వెళ్లిపోయింది.
ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించినట్లు తెలిసింది. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్‌పై అదే కలర్ దుస్తులతో వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని రీతితో కనిపించింది. మృతదేహాంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దినపత్రికల్లో రావడంతో మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్‌గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్ ఈ రైల్వే పోలీసుల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు.
చైన్నెలో ఉన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గాంధీకి, శరవణన్‌కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్ లిప్ట్ చేయలేదు. మే 28వ తేదీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా సొక్కమ్మాల్ సోమవారం ఉదయం శరవణన్ ఇంటి వద్దకు రావడంతో కలకలం రేపింది. సొక్కమ్మాల్ ప్రాణంతో వచ్చారన్న విషయం తెలియడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మృతి చెందిన మహిళ తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, ప్రస్తుతం తన తల్లి ప్రాణంతో ఇంటికి వచ్చిందని సమాచారం అందించాడు. దీంతో రైల్వే పోలీసులు శరవణన్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ సొక్కమ్మాల్ కాదని నిర్ధారించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ అంబిక, ఆర్‌ఐ గణేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్‌ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్‌హిల్స్‌కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్(66)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment