-రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 446
-కాంట్రాక్టు లెక్చరర్లు 3,776 మంది
-ఇప్పటి వరకు ఎన్ని నెలల జీతం రావాల్సి ఉంది 3
-ఎంత మొత్తం... రూ.20.40 కోట్లు
సాక్షి, చిత్తూరు
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగభద్రత లేక అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఇవి కూడా నెలనెలా సక్రమంగా రాకపోతుండటంతో వారు అప్పుల పాలవుతున్నారు. కుటుంబపోషణ భారమై మానసిక వేదన అనుభవిస్తున్నారు. పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ రాత మారలేదని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 446 జూనియర్ కళాశాలల్లో 3,776 మంది పని చేస్తున్నారు.
రెగ్యులర్‌లతో సమానంగా సేవలందిస్తున్నా...
2000లో కాంట్రాక్టు ఒప్పంద అధ్యాపక వ్యవస్థ వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్య గణనీయంగా మెరుగుపడింది. అంతకుమునుపు జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం కేవలం 23 మాత్రమే. ప్రస్తుతం ఇది సుమారు 75 శాతానికిపైగా ఉంది. ఉత్తీర్ణత కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో మూల్యాంకణ సేవలందిస్తున్నా వీరికి జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల కనీస చట్టాలు ఈఎస్‌ఐ, పీఎఫ్ లాంటివి కూడా అమలు చేయకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వీరికి జీతం లేకుండా కేవలం రెండు నెలలు మాత్రమే సెలువులు ఇస్తున్నారు.
ఇప్పటికీ కాంట్రాక్ట్ రెన్యువల్ లేదు....
కళాశాలలు ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు రాకపోవడంతో లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. ఒప్పందం పునరుద్ధరించకపోవడంతో ఇప్పటి వరకు వారికి జీతాలు కూడా రాలేదు. అప్పటి విద్యాశాఖ కమిషనర్ సత్యనారాయణకు కాంట్రాక్టును రెన్యువల్ చేయాలని ఇప్పటి వరకు 3 సార్లు వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన కమిషనర్ ఆర్థిక శాఖకు రెండు సార్లు ఫైల్ పంపారు. ఆ శాఖ రెండు సార్లు ఫైల్‌ను తిప్పిపంపింది. ఎందుకు ఫైల్‌ను తిప్పిపంపింది అనేది కూడా ఆర్థిక శాఖ అధికారులు చెప్పడంలేదని ఒప్పంద లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల నుంచి జీతాలు రాక దుర్భర జీవితం అనుభవిస్తున్నామని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ముఖ్యమంత్రులు మారని రాతలు...
2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు లెక్చరర్ల పద్ధతిని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారినా కాంట్రాక్టు లెక్చరర్ల స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. సమాన పనికి సమాన జీతం అమలు కాకపోవడంతో వీరి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్‌లు ఊపందుకోవడంతో 2011లో జీవో నెం3 విడుదల చేశారు. దీని ప్రకారం రెగ్యులర్ లెక్చరర్‌ల మూలవేతనాన్ని కాంట్రాక్టు లెక్చరర్‌ల వేతనంగా ఇవ్వాలి. దీని ప్రకారం అందరికీ రూ.18 వేల జీతం చెల్లిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దీన్ని తంగలో తొక్కారు. 10 వ పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు.
రెగ్యులర్ చేస్తామనే హామీ ఏమైంది బాబూ..
16 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 2012 రాజమండ్రిలో చేపట్టిన సమ్మేకు చంద్రబాబు నాయుడు సంఘీభావం ప్రకటించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. 2014లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా కమిటీ వేశారు. సమన్వయకర్తగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌ను నియమించారు. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించగా.. 2 సంవత్సరాలు పూర్తై ఇప్పటి వరకు నివేదిక సమర్పించ లేదు.
1010 పద్దు కింద జీతాలు ఇవ్వాలి..
జీతాలు 1010 పద్దుకింద చెల్లించాలి. జీతం సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా చితికిపోతున్నాం. ఏప్రిల్, మేనెలల్లో జీతాలు రాకపోవడంతో ఆ రెండు నెలలూ కష్టాలు ఎదుర్కొంటున్నాం. గురుకుల పాఠశాలల్లో పని చేసే కాంట్రాక్టు అధ్యాపకులకు ఆ రెండు నెలలకూ జీతం చెల్లిస్తున్నారు. మాకు కూడా చెల్లించాలి.
-శ్రీనివాసరావు తెలగనీడి, కెమిస్ట్రీ లెక్చరర్, గురజాల, గుంటూరు.
తక్షణమే పీఆర్సీ అమలు చేయాలి..
జీవో నెం3 ప్రకారం జీతాలు చెల్లించాలి. పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ప్రతినెలా రూ.19 వేలు నష్టపోతున్నాం. రెగ్యులర్‌లతో సమానంగా పని చేస్తున్నా.. జీతం మాత్రం తక్కువ ఇస్తున్నారు. దీన్ని సవరించాలి. మెటర్నిటీలీవ్‌లు తీసుకుంటే జీతం కట్ చేస్తుచేస్తున్నారు. ఇది దారుణం. వెంటనే పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రామిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ లెక్చరర్, బల్లికురువ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రకాశం జిల్లా.
రెగ్యులర్ చేయాలి...
16 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా రెగ్యులర్ చేయడం లేదు. ఇన్నేళ్లు విద్యావ్యవస్థకు సేవలందించాం. కనీసం జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. రెగ్యులర్ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఒట్టి మాటగానే మిగిలిపోయింది. నెలరోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన సబ్ కమిటీ రెండు సంవత్సరాలైనా నివేదిక సమర్పించలేదు. కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే రెగ్యులర్ చేయాలి. ముఖ్యమంతి మాట నిలబెట్టుకోవాలి.
- చంద్రశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్, ప్రభుత్వజూనియర్ కళాశాల, కడప