కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
Published Tue, Nov 8 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
– మంత్రి కామినేని శ్రీనివాస రావు
నూనెపల్లె: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆసుపత్రిలో నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస రావు మాట్లాడుతూ ఖరీదైన కార్పొరేట్ డయాలసిస్ కేంద్రాన్ని నంద్యాల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28 రకాల ఖరీదైన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణుల కోసం 102 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. తల్లి, బిడ్డ సంరక్షణ మొదలు కాన్పులు చేసే వరకు తమదే బాధ్యత అన్నారు. నూతనంగా 108 వాహనాలను కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్‌హెల్త్ సెంటర్లను పటిష్ట పరుస్తున్నామన్నారు. అపోలో ఆధ్వర్యంలో వీటి నిర్వహణ చేపట్టి క్షేత్రస్థాయి నుంచే పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల ఆసుపత్రిలో సిబ్బంది కొరతను త్వరలోనే తీరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఏపీ వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ జయచంద్రారెడ్డి, డీఎంఅడ్‌హెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, బీజేపీ నాయకులు ఇంటి ఆదినారాయణ, సూర్యనారాయణ రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ రామకృష్ణరావు, సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చేపట్టాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రుడు, ఏపీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగనవీన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు.
Advertisement
Advertisement