- ‘నీరు-చెట్టు’ పనుల్లో అంతులేని అక్రమాలు
- పనులు చేయకున్నా రికార్డుల్లో నమోదు
- నిధులను పంచుకుతిన్న ‘తమ్ముళ్లు’
- సహకరించిన జలవనరుల శాఖ అధికారులు
- రాయదుర్గం నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద పనులు చేయకున్నా.. చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి నిధులు కొల్లగొట్టారు. మరికొన్ని పనులను నాసిరకంగా చేపట్టి..భారీగా సొమ్ము చేసుకున్నారు. స్వయాన ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇలా జరగడంపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, నీటి సంఘాల సభ్యులు కలిసి సాగించిన ఈ అవినీతి బాగోతానికి జల వనరుల శాఖ అధికారులు కూడా సహకరించారు.
రాయదుర్గం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నీరు- చెట్టు’ కార్యక్రమం కొందరికి కల్పతరువుగా మారింది. ఈ కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత, చెరువు మట్టిని చిన్న, సన్న కారు రైతుల పొలాలకు తరలించడం, వర్షపు నీరు వృథా కాకుండా చెరువులు, కుంటలకు మళ్లించేందుకు వాగులు, వంకల తవ్వకాలు, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులకు అనుమతిచ్చారు. అయితే..రాయదుర్గం నియోజకవర్గంలో చేయని పనులను కూడా చేసినట్లు రికార్డులు సృష్టించారు. వంతపాడిన అధికారులకు కమీషన్లు ముట్టజెప్పి.. అధికారపార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, నీటిసంఘాల సభ్యులు వాటాలు వేసుకుని స్వాహా చేశారు.
నియోజకవర్గంలో జలవనరుల శాఖ ద్వారా నీరు- చెట్టు పథకానికి 2015 నుంచి 2016 డిసెంబర్ వరకు 323 పనులకు గాను రూ.19 కోట్ల 39 లక్షల 93 వేలు మంజూరు చేశారు. ఇందులో రాయదుర్గం మండలంతో పాటు పట్టణ పరిసరాల్లోని చెరువుల్లో పూడికతీత, మట్టి తరలింపు, వాగులు, వంకల మరమ్మతులకు 68 పనులకు గాను రూ.4,61,74,000, గుమ్మఘట్ట మండలంలో 57 పనులకు రూ.3,00,85,000, డి.హీరేహాళ్ మండలంలో 120 పనులకు రూ.7,41,08,000, బొమ్మనహాళ్ మండలంలో 22 పనులకు 1,33,14,000, కణేకల్లు మండలంలో 56 పనులకు గాను రూ.3,03,12,000 కేటాయించారు.
నిబంధనలకు తిలోదకాలు
మంజూరైన పనుల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయలేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. కనీసం 40 శాతం పనులు జరిగినా రైతులకు మేలు జరిగేది. తూతూ మంత్రంగా పనులు చేసి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. అధికారుల కమీషన్లు పోను మిగిలిన సొమ్మును స్థాయిని బట్టి వాటా వేసుకున్నారు. ఈ విధంగా దాదాపు రూ.12 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అంచనా. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన పూర్తిస్థాయిలో చేయలేదు. జరిగిన పనుల గురించి వివరాలు చెప్పడానికి కూడా అధికారులు నసేమిరా అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీసం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల వివరాలు వెల్లడించడానికి కూడా అధికారులు సుముఖంగా లేరు.
పక్కదారి పట్టించారిలా..
ఒకే పనికి రెండు బిల్లులు పెట్టడం, చేయని పనులనూ చేసినట్లు రికార్డుల్లో చూపడం తదితర మార్గాల ద్వారా నిధులు కాజేశారు. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామం వద్దనున్న మారయ్య గారి వంక, తాటివంక, వడ్డుకుంట సర్వు(వాగు) నుంచి బీటీపీలోకి వెళుతున్న వంకలను మరమ్మతులు చేయడానికి రూ.9.80 లక్షలు కేటాయించారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బిల్లులు కూడా కొంతవరకు చెల్లించారు. మిగిలిన మొత్తం నాలుగైదురోజుల్లో విడుదల కానున్నట్లు అధికారులే చెబుతున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పనులు పూర్తి కాలేదు. మారయ్య గారి వంక పనులు తూతూఽమంత్రంగా చేసి బీటీపీ చెరువుకు కలిపారు. మిగిలిన రెండు పనులు అర్ధాంతరంగా ఆపేశారు. కేపీ కుంట నుంచి బీటీపీకి వెళ్లే దారిలో కల్వర్టు వద్ద వడ్డుకుంటసర్వు పనులు ఎడమ వైపున పూర్తిగా జరగలేదు. కుడివైపున మాత్రం జరిగాయి. అలాగే తాటివంక ప్రారంభంలోను, చివర వడ్డుకుంట సర్వు వంకకు కల్వర్టు వద్ద కలిపే పనులు చేయలేదు.
- డి.హీరేహాళ్ మండలం గొడిశలపల్లి మైనర్ ఇరిగేషన్ చెరువులో పూడికతీత, మట్టిని రైతుల పొలాలకు, ఇంటర్నల్ రోడ్ల గుంతలు పూడ్చడానికి, వృథాగా ఉన్న గుంతలను పూడ్చడానికి తరలించడం కోసం మొత్తం రూ.38.36 లక్షలు ఽకేటాయించారు. ఇందులో పూడికతీత మట్టిని రైతుల పొలాలకు తరలించడం కోసం రూ.8.60 లక్షలు, అదే మట్టితో ఇంటర్నల్ రోడ్ల గుంతలను పూడ్చడానికి రూ.9.80 లక్షలు ఖర్చు అయినట్లు చూపారు. వాస్తవమేమిటంటే కొంతమేర పనులు చేస్తుండగానే గత సంవత్సరం జూలైలో కురిసిన వర్షానికి చెరువు నిండింది. ఇదే కాంట్రాక్టర్‌కు కలిసొచ్చింది. పనులు పూర్తి చేసినట్లు చెప్పి రూ.18.40 లక్షలు బిల్లు చేసుకున్నారు. ఈ ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేయిస్తే మరెన్నో అవినీతి బాగోతాలు బహిర్గతమయ్యే అవకాశముందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.
వివరాలు చెప్పేది లేదు
చేసిన పనుల వివరాలు కావాలంటే చెబుతాం. కాంట్రాక్టర్ల వివరాలు మాత్రం మా దగ్గర లేవు. ఆ సమాచారం ధర్మవరం ఈఈని అడగాలి. చేసిన పనులపై వివరణ చెప్పేదిలేదు. చెప్పకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మీకు సమాచారం కావాలంటే ఎస్‌ఈని గానీ,ఈఈగానీ సంప్రదించండి.
- కరీముల్లా, డీఈఈ, జలవనరుల శాఖ, రాయదుర్గం
పనులన్నీ కనికట్టు.. నిధులు కొల్లగొట్టు
Published Tue, Jan 10 2017 11:07 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
Advertisement