నీరు– చెట్టు పేరుతో దోపిడీ
అర్బన్ ఎస్పీకి వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
గుంటూరు (పట్నంబజారు) : నీరు –చెట్టు పేరుతో అధికార పార్టీ నేతలు మట్టిని దోచుకుతింటూ వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ ధ్వజమెత్తారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ పంచాయతీలోని ఒక చెరువును అధికార పార్టీ నేతలు అక్రమంగా తవ్వుతున్నారని, దీనికి పెదకాకాని సీఐ ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి విన్నవించారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో పెదకాకాని సీఐ వచ్చి చెరువుపై ఉన్న మోటార్లను సర్వనాశనం చేశారని తెలిపారు. చెరువులో ఉన్న నీరు తాగేందుకు పనికిరాదనే నెపంతో సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర శాఖల నుంచి అనుమతులు తెచ్చుకుని అక్రమంగా తవ్వుతున్నారని రావి వెంకటరమణ ఆరోపించారు. పోలీసులు పాలకపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ ఇదేమని ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలను ఆపాలని, లేని పక్షంలో ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఎస్పీనికలిసిన వారిలో వైనిగండ్ల గ్రామ సర్పంచ్ తులసిబాయి, వెఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాల వజ్రబాబు (డైమండ్), పెదకాకాని మండల పార్టీ నేతలు, గ్రామ ప్రజలు ఉన్నారు.