అవినీతిని రూపుమాపేందుకే పెద్ద నోట్ల రద్దు
ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సంఘ చాలక్ వెంకటేశ్వర్‌రావు
నగరంలో కదం తొక్కిన స్వయం సేవకులు
నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక తొలి సమ్మేళనం
విద్యారణ్యపురి : వేళ్లూనుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ అధ్యక్షుడు ప్యాట వెంకటేశ్వర్‌రావు అన్నారు. అలాగే, కశ్మీర్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల గణవేశ్(యూనిఫాం) నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక వరంగల్‌లోని తరుణ స్వయం సేవకుల కోసం తొలి సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటుచేశారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ఈ సమ్మేళనంలో వెంకటేశ్వర్‌రావు ముఖ్యఅతిథి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తొలుత ఇబ్బంది పడుతున్నా.. ఎవరూ ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. నల్లధనం కలిగిన ఉన్న వారు మాత్రం ఎలా మార్చుకోవాలో తెలియక నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
తొమ్మిది దశాబ్దాల ఆర్‌ఎస్‌ఎస్
ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభమై తొమ్మిది దశాబ్దాలు గడిచిందని.. అప్పటి నుంచి దేశం నలుమూలలా సంఘ కార్యక్రమాలను విస్తరించాయని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని నింపడంలో సంఘం నిరంతరం కృషి చేస్తుంండగా.. సమాజంలోని మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. 1925నుంచి ఉన్న సంఘ గణవేష్ మార్పు విషయమై అఖిల భారత స్థాయిలో చర్చించాక కాలానికి అనుగుణంగా, అందరికీ సౌకర్యంగా ఉండేలా నిక్కర్ స్థానంలో ప్యాంట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే, గణవేష్ మారినా సంఘం సిద్ధాంతాలు మారవని ఆయన స్పష్టం చేశారు. దళితుల పట్ల వివక్ష చూపని సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌కు పేరుందన్నారు.
అనంతరం జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి జగన్నాథం మాట్లాడుతూ దేశరక్షణ, అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ వరంగల్ జిల్లా, మహానగర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పాణుగంటి విశ్వనాథ్ మాట్లాడారు. కాగా, సమ్మేళనంలో తొలుత స్వయం సేవకులు నూతన యూనిఫాంతో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి హన్మకొండ చౌరస్తా, అశో కా జంక్షన్, పెట్రోల్‌పంపు, కమ్మరి వాడ, కిషన్‌పుర, పరేడ్ గ్రౌండ్ మీదుగా నిర్వహించిన పధ సంచలన్(రూట్ మార్చ్) ఆకట్టుకుంది.