అర్కటవేముల(రాజుపాళెం): జిల్లాలో పత్తిని ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. గతేడాది ధరలు, దిగుబడి బాగుండటంతో ఈ ఏడాది ఎంతో ఆశతో రైతులు సాగు చేశారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. పువ్వు దశకు రాగానే పురుగు ఆశించడంతో పంట మొత్తం దెబ్బతినింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాల్లో ఈ పంట సాగు అవుతోంది. గతేడాది 22 వేల హెక్టార్లలో సాగైంది.
గతేడాది ధర అత్యధికంగా క్వింటాలు రూ.7,200 పలకడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు సాగు చేయడానికి ఆసక్తి కనబరిచారు. వర్షాభావం వారిని వెంటాడింది. ఇప్పటి వరకు 4,800 హెక్టార్లలో సాగు చేశారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. 50 రోజుల క్రితం సాగు చేసిన పంట పూత, కాయ దశకు చేరుకుంది. ఇటివంటి పరిస్థితిలో పంటను ఎర్ర గులాబి రంగు పురుగు (పింక్ బోల్వాన్) ఆశించింది. మొక్క పువ్వులో పురుగు ఏర్పడటంతో మున్ముందు ఈ పంట సాగుకు పెట్టుబడులు వృథా అని భావించిన రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు.
ఒక్కొక్కరుగా దున్నేస్తున్నారు..
ఇప్పటికే ఎకరాకు విత్తనాలు, నాటిన కూలీలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు కూలీలు కలిపి రూ.10 వేలు ఖర్చు చేశారు. రెండు దఫాలుగా నాలుగైదు సార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. పంట చూస్తే పచ్చగా కళకళలాడుతున్నా ఈ పురుగు ఆశించడంతో రైతులు ఒక్కొక్కరుగా దున్ని వేసేందుకు ఉపక్రమించారు. జిల్లాలో రాజుపాళెం మండలంలోనే ఈ పంట ఎక్కువగా సాగు అవుతుంది. మండలంలోని కొర్రపాడు, రాజుపాళెం, గాదెగూడూరు, వెంగళాయపల్లె, సోమాపురం, అర్కటవేముల, తొండలదిన్నె తదితర గ్రామాల్లో దాదాపుగా 1500 ఎకరాల్లో సాగైంది. శుక్రవారం అర్కటవేముల గ్రామానికి చెందిన సిద్ది వెంకట ప్రసాద్‌రెడ్డి 8.50 ఎకరాలు, తల్లు సుబ్బిరెడ్డి 3 ఎకరాల్లో ట్రాక్టరుతో దున్నివేశారు. అదే బాటలో మరి కొంత మంది రైతులు నడిచేందుకు సిద్ధ పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పైగా ఈ పంటను సాగు చేశారు.
మందులు వాడినా అంతే:
ఖరీదైన పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. గతేడాది చివరలో ఈ పురుగు ఆశించడంతో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి నష్టపోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఈ ఏడాది మొదట్లోనే ఆశించడంతో మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎనిమిదిన్నర్ర ఎకరాల్లో దున్నేశా
నేను ఎనిమిదిన్నర్ర ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేశా. ప్రస్తుతం పంటలో పూత, కాయ బాగుంది. పూత, కాయల్లో గులాబి రంగు పురుగు పడటంతో ఖరీదైన మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయింది.
పత్తి రైతు.. చిత్తు
Published Fri, Aug 12 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
Advertisement
Advertisement