బుడతవలసలో రీకౌంటింగ్ నేడే
Published Fri, Aug 5 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
లావేరు: మండలంలోని బుడతవలస పంచాయతీ ఎన్నికలుకు శనివారం రీ కౌంటింగ్ జరుగనుంది. దీంతో మండలంలోని వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. 2013 జూలై నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్‌లో ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఏకపక్షంగా వ్యవహరించారని, తనకు పడిన 61 ఓట్లును చెల్లని ఓట్లుగా పరిగణించడం వల్లనే తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఓడిపోయానని, రీకౌంటింగ్ చేయమని అడిగినా ఎన్నికల అధికారి పట్టించుకోలేదని మళ్లీ తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బుడుమూరు పాపారావు శ్రీకాకుళం పీడీఎఫ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పీడీఎఫ్ కోర్టు జడ్జి పద్మావతి శనివారం బుడతవలస పంచాయతీ ఎన్నికలకు శ్రీకాకుళంలోని కోర్టులో రీకౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఎన్నికలు రీకౌంటింగ్ కావడంతో ఎన్నికల ఫలితాల కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పొందూరు ట్రెజరీ నుంచి లావేరు మండల అధికారులు బ్యాలెట్ బాక్సును తీసుకెళ్లనున్నారు. ఈ నెల 1న బుడతవలస పంచాయతీ ఎన్నికల బ్యాలట్ బాక్సును లావేరు ఎంపీడీఓ కిరణ్‌కుమార్, సూపరింటెండెంట్ విజయరంగారావులు శ్రీకాకుళంలోని పీడీఎఫ్ కోర్టుకు తీసుకువెళ్లగా 6న రీకౌంటింగ్ ఉంటుందని, అప్పుడు బ్యాలట్ బాక్సును తీసుకురావాలని జడ్జి ఆదేశించారు. దీంతో ఆ రోజు పొందూరు ట్రెజరీ కార్యాలయంలో ఎంపీడీఓ బ్యాలెట్ బాక్సును భద్రపరిచారు.
Advertisement
Advertisement