ఏమైందో.. ఏమో! | couple suicide in ramachandrapuram | Sakshi
Sakshi News home page

ఏమైందో.. ఏమో!

Published Thu, Sep 22 2016 10:51 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

వెంకట సురేశ్‌, భవాని ఫైల్‌ఫొటో - Sakshi

వెంకట సురేశ్‌, భవాని ఫైల్‌ఫొటో

  • దంపతుల ఆత్మహత్య.. అనాథగా మిగిలిన చిన్నారి
  • రామచంద్రాపురం: అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌నగర్‌ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాడిపత్రికి చెందిన సీహెచ్‌ వెంకటసురేశ్‌ (30), అదే ప్రాంతానికి చెందిన భవాని (25)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు సాయిదీప్‌ ఉన్నాడు.

    కాగా, వెంకటసురేశ్‌ హైటెక్‌సీటీ ప్రాంతంలోని హెచ్‌సీఎల్‌ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 8 నెలల క్రితం జీడిమెట్ల నుంచి వచ్చి విద్యుత్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కాగా, గురువారం సాయంత్రం పరిచయస్తుడు ఒకరు వెంకటేశ్‌ ఇంటికి వచ్చారని, ఆ సమయం సాయిదీప్‌ ఏడుస్తుండగా గమనించి.. ఆయన లోనికి వెళ్లి చూడగా ఘోరం వెలుగు చూసిందని మృతుల బంధువులు చెబుతున్నారు.

    సదరు పరిచయస్తుడు ఇచ్చిన సమాచారంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారంతా లోనికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో భవాని ఉరివేసుకొని ఉంది. ఆమె గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. భార్య మొదట ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ భయంతో సురేశ్‌ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

    కాగా, మృతురాలి అన్న పవన్‌కుమార్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. తన బావ ఎవరికో అప్పు ఇప్పించాడని, ఆ విషయంలో కొద్ది రోజులుగా బాధ పడుతున్నట్టు వివరించాడు. అంతేకాకుండా వెంకటేశ్‌ తాగుడుకు బానిస కావడంతో చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో సాయిదీప్‌ అనాథగా మిగిలాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement