
బాబూ.. అక్కడ షూటింగ్ వద్దు
గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కరాల్లో షూటింగ్ పెట్టుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు.
సీఎంకు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హితవు
సాక్షి, విజయవాడ బ్యూరో: గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కార్యక్రమాలు పెట్టుకొని 29 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు.. కృష్ణా పుష్కరాల్లో అలాంటివేవీ చేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే దుర్గాఘాట్‌లో సినిమా షూటింగ్ వద్దని సీఎంకు బోయపాటి శ్రీను డెరైక్షన్ ఇవ్వాలని సూచించారు. విజయవాడలో జరుగుతున్న పుష్కర పనులను సీపీఐ బృందంతో కలసి రామకృష్ణ గురువారం పరిశీలించారు.
పుష్కర పనుల పురోగతి, నాణ్యత వంటి విషయాలను జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పనులకు సంబంధించి లోకేశ్ కనుసన్నల్లో రూ. వందల కోట్లు నామినేషన్ పద్ధతిపై ఇచ్చి అవినీతికి ఆస్కారం ఇచ్చారని విమర్శించారు. అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా ఆగస్టు 7న గుంటూరులో జరిగే సదస్సులో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని వెల్లడించారు. పుష్కర పనులు పరిశీలించిన వారిలో రామకృష్ణతోపాటు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఉన్నారు.
విజయవాడలో అతి ముఖ్యమైన దుర్గాఘాట్ పనులు ఇంకా సాగుతూనే ఉండగా, డిప్పింగ్ చానల్ అయితే ఇసుక సంచులు వేసి హడావుడిగా పనులు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనంతో చేపట్టే ఈ పనులన్నీ శాశ్వతంగా ఉండాలని కాకుండా ఏదో 12 రోజులు ఉంటే చాలన్నట్టుగా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా చట్టాలను ఉల్లంఘించి ఇలా పనులు నాణ్యత లేకుండా చేస్తున్నారని తప్పుబట్టారు.