సీపీఐ బస్సు యాత్ర ప్రారంభం | cpi bus yatra started | Sakshi
Sakshi News home page

సీపీఐ బస్సు యాత్ర ప్రారంభం

Published Sun, Sep 11 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

సీపీఐ బస్సు యాత్ర ప్రారంభం

సీపీఐ బస్సు యాత్ర ప్రారంభం

యాదగిరిగుట్ట
సాయుధ పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా అని, జిల్లాలో రగిలిన ఉద్యమ స్ఫూర్తితోనే నైజాం రాజుల కోటలను బద్దలు కొట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. యాదగిరిగుట్టలో ఆదివారం ప్రారంభమైన సాయుధ పోరాట యాత్రలో ఆయన అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆనాడు బాంఛన్‌ దొరా.. నీ కాల్మొక్తా అన్న అమాయకులకు అండగా నిలిచి బందూకులు చేతబట్టి నిజాం నవాబులను తరిమికొట్టిన ఘనత మన తెలంగాణ వీరులదన్నారు. భువనగిరి కేంద్రంగా ప్రారంభమైన ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగిందని తెలిపారు. సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఆ ఉద్యమం ఫలితంగానే సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం చేసిందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను అడ్డంపెట్టి పోరాటం చేసిన యోధుడు.. దేశ చరిత్రలోనే నెహ్రూ కంటే అధిక మెజారిటీతో గెలుపొందిన రావి నారాయణరెడ్డి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్‌ 17 గోల్కోండ కోటపై ప్రభుత్వమే అధికారికంగా జాతీయ జెండా ఎగురవేయాలని డిమాండ్‌ చేశారు. 
కేసీఆర్‌ నైజాంకు వారసుడా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో నైజాం రాజులను విమర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు నైజాంల చరిత్రను ఎందుకు తెరపైకి తెస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నైజాంలను పొగుడుతున్న సీఎం కేసీఆర్‌.. నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి అయిలమ్మకు ఎంపీ కవిత ఏమైనా వారసులా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ మాటలకు, చేతకుల అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో విభజించు, పాలించు పాలసీని సీఎం కేసీఆర్‌ అవలంబిస్తున్నారని విమర్శించారు. రానున్న తరాలకు సాయుధ పోరాటాల చరిత్రను తెలియజేయడానికే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులు వీరులను తలుచుకుంటూ ఉద్యమగీతాలను ఆలపించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జెండాను ఆవిష్కరించగా.. జాతీయ కార్యదర్శి కె.నారాయణ బైక్‌ యాత్రను ప్రారంభించి మండలంలోని ధర్మారెడ్డిగూడెంకు తరలివెళ్లి అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు,  కె.ప్రతాప్‌రెడ్డి, పల్లా నర్సింహరెడ్డి, గన్నా చంద్రశేఖర్, నెల్లికంటి సత్యం, దామోదర్‌రెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, కాంతయ్య, నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి, కట్కూరి రాంగోపాల్‌రెడ్డి, కళ్లెం కృష్ణ, నాయకులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, బబ్బూరి నాగయ్య, కోకల రవి, పేరబోయిన పెంటయ్య, గాదెగాని మాణిక్యం, బబ్బూరి శ్రీధర్, పేరబోయిన మహేందర్‌ తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement